రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది ప్రభుత్వం. 2020-21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు, 2021-22 విద్యా సంవత్సరం నుంచి 9వ తరగతికి, 2022-23 విద్యాసంవత్సరం నుంచి 10 తరగతి విద్యార్థులకు దీనిని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అయితే ఆయా తరగతుల్లో తెలుగు లేదా ఉర్దూ సబ్జెక్టుగా పెట్టాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించింది.
అంతేకాదు.. ప్రభుత్వ స్కూళ్లు అనుసరించవలసిన కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది ప్రభుత్వం..
*ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు.. విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఎప్పటికప్పుడు టీచర్లను నియమించాలి.
*వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని స్కూళ్లలో ఒకటి నుంచి పదవ తరగతులను ఇంగ్లీష్ మీడియంలోకి మారుస్తుండగా అందుకు తగ్గట్టుగా అవసరమైన టీచర్ల సంఖ్యను విద్యాశాఖ కమిషనర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలి.
* ఇంగ్లీష్ మీడియంలో బోధించేందుకు వీలుగా ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే.. టీచర్లకు శిక్షణా కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహించాలి. వేసవి సెలవుల్లోనూ శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతాయి.
*టీచర్లు ఇంగ్లిష్ మీడియంలో చెప్పగలిగే సామర్థ్యం మెరుగుపడే వరకు సంబంధిత సబ్జెక్టు, ఇతర అంశాలపై వారికి తగిన శిక్షణ ఇవ్వాలి.
* ఇంగ్లీష్ మీడియం చెప్పగలిగే సామర్థ్యం ఉంటేనే భవిష్యత్తులో టీచర్లను నియమించుకోవాలి.
*ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ సెంటర్లు, డిస్ట్రిక్ట్ ఇంగ్లిష్ సెంటర్లను.. డిస్ట్రిక్ట్ ఇన్‌స్టిట్యూట్స్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్‌లుగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలి.