కొరికితే పిల్లలు పుడతారట : యాదాద్రిలో కొరుకుడు బాబా

యాదాద్రి : ఎంతమంది బాబాలు మాయలు మోసాలు బైటపడుతున్నా ప్రజలు మాత్రం బాబాల ముసుగులో దగాలు చేస్తున్న వ్యక్తుల వలలో పడుతునే ఉన్నారు. ఈ క్రమంలో మరో బాబా మోసాలు వెలుగులోకొచ్చాయి యాదాద్రి భువనగిరి జిల్లా పుల్లాయగూడెంలో. ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న ఓ మాయగాడు ‘కొరుకుడు’ బాబా అవతారం ఎత్తాడు. ఈ బాబా కొరికితే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని ప్రజలు తండోపతండాలు వచ్చిన అమాయకులు బాబాతో కొరికించుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా హల్ చల్ చేస్తున్న ఈ ‘కొరుకుడు’ బాబాకు సంకెళ్లు వేసారు పోలీసులు.
తాను కొరికితే సంతానం లేనివాళ్లు సంతానం పొందుతారని, మగవాళ్లకు జబ్బులు నయమవుతాయని జనాల్లో ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టాడు. మగవాళ్లను కిందపడేసి తొక్కడం, ఆడవాళ్లను ఎక్కడ పడితే అక్కడ కొరకడం వంటి వికృత చేష్టలతో జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నాడు. వీడి వికార చర్యల్ని వీడియో తీసిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. ఆడామగా అనే తేడాలేకుండా అందరినీ కొరికే వీడితో కొరికించుకునేందుకు రూ.100 నుంచి రూ.200 వరకు ఫీజు వసూలు చేస్తాడు. అదేమంటే ఇదోరకం వైద్యం అంటాడు. ఆరో తరగతి వరకు చదుకున్న కొప్పుల రాంరెడ్డి కొరుకుడు బాబా అవతారం ఎత్తి ప్రజల మూర్ఖత్వాన్ని ఆసరా చేసుకుని డబ్బులు దండుకుంటున్నాడు. ఈ క్రమంలో పాపం పండి పోలీసులకు చిక్కాడు.