వైయస్ఆర్ ఆదర్శ పథకం : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు యువతకు అవకాశం

  • Publish Date - October 16, 2019 / 10:13 AM IST

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు యువతకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారికి అండగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 16వ తేదీ బుధవారం సీఎం జగన్ అధ్యక్షతనలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇసుక రవాణా, పౌరసరఫరాలు సహా ప్రభుత్వం వాడే ప్రతి రవాణాలో స్వయం ఉపాధికి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వివిధ సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా ట్రక్కుల కొనుగోలుకు అవకాశం కల్పించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 

అందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు యువతకు అవకాశం ఇవ్వాలని, వైఎస్సార్ ఆదర్శం కింద పథకం అమలుకు శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకుంది. ట్రక్కు కొనుగోలుకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలని, లబ్దిదారుడు రూ. 50 వేలు కడితే టక్కు వచ్చేలా స్కీంను రూపొందించాలని సీఎం జగన్ సూచించారు. ఎక్కడా అవినీతి లేకుండా..పారదర్శకంగా ఉండేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో లబ్దిదారులను ఎంపిక చేయాలని ఆమోదించారు.

కనీసం నెలకు రూ. 20 వేలు ఆదాయం వచ్చేలా చూడాలని, జిల్లాల వారీగా లక్ష్యాలు రూపొందించాలని ఆదేశించారు. ఐదేళ్ల తర్వాత యువతకు వాహనం సొంతం అయ్యే విధంగా చూడాలని, త్వరలో విధి విధానాలను రూపొందించాలని సీఎం జగన్ సూచించారు. 
Read More : ఏపీ కేబినెట్ : మత్స్యకారులకు రూ. 10 వేలు, న్యాయవాదులకు రూ. 5 వేలు