ఎన్నికల ఎఫెక్ట్ : మదనపల్లి టూ టౌన్ సీఐ బదిలీ

  • Publish Date - April 6, 2019 / 02:33 PM IST

ఏపీలో ఎన్నికలకు ఇంకా కొద్ది రోజుల మాత్రమే టైం ఉంది. పార్టీలు ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నాయంటూ ఎన్నికల అధికారులకు కంప్లయింట్స్ వస్తున్నాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. తాజాగా టీడీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందని..కేసు పెట్టాలని చెప్పినా వినిపించుకోని ఓ సీఐపై ఏపీ సీఈవో ద్వివేదీ కొరడా ఝులిపించారు. బదిలీ వేటు వేశారు. 

చిత్తూరు జిల్లా మదనపల్లి టూ టౌన్ సీఐ సురేష్ కుమార్‌ను సీఈవో ద్వివేదీ బదిలీ చేశారు. టీడీపీ ప్రచార సభలో కోడ్ ఉల్లంఘన ఘటనలో ఎన్నికల పరిశీలకులు నవీన్ కుమార్ చెప్పినా సీఐ కేసు నమోదు చేయలేదు. ఈ విషయాన్ని సీఈవో ద్వివేదీకి నవీన్ కుమార్ ఫిర్యాదు చేశారు. సీఐ సురేష్ కుమార్‌ని ఎన్నికల విధుల నుండి తొలగిస్తున్నట్లు ఏప్రిల్ 06వ తేదీ శనివారం ద్వివేదీ ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 07వ తేదీ ఆదివారం ఉదయం 11గంటల లోపు కొత్త సీఐని నియమిస్తామని ద్వివేదీ వెల్లడించారు. మరోవైపు టీడీపీకి ఓటేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సెర్ప్ సీఈవో కృష్ణమోహన్‌పై సీఈవో ద్వివేదీ ద‌ృష్టి సారించారు.