ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్బన్ ప్రాంతాల్లో కరోనా వైరస్ నియంత్రణపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం అధికారులతో సమీక్షి నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 40కి చేరాయని..కొత్తగా 17 కేసులు నమోదయ్యాయని అధికారులు వివరించారు.
అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 11 కేసులు నమోదు కాగా, ఒక్క చీరాలలోనే 5 కేసులను గుర్తించారు. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 9 కేసులు, విశాఖలో 6, కృష్ణాలో 5, తూర్పు గోదావరిలో 4, అనంతపురంలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒకటి చొప్పున కరోనా పాజిటివ్ కేసులను గుర్తించారు.
వీరిలో చాలా మంది ఢిల్లీలోని, హజ్రత్ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లీగీ జమాత్ సదస్సుకు హాజరైన వారు, వారి కుటుంబ సభ్యులేనని అధికారులు సీఎం కు వివరించారు. రాష్ట్రం నుంచి వెళ్లిన వారు, అదే రోజు రైల్లో ప్రయాణం చేసిన వారి వివరాలను సేకరించామని అధికారులు తెలిపారు.
జమాత్ నిర్వాహకుల నుంచి, పోలీసుల నుంచి, రైల్వే అధికారుల నుంచి.. ఇలా వివిధ రకాలుగా సమాచారం సేకరించి వారిని క్వారంటైన్‌కు, ఐసోలేషన్‌కు తరలిస్తున్నామన్న అధికారులు సీఎం కు తెలిపారు. వీరిపై ప్రధానంగా దృష్టి సారించి ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
కాగా….లండన్ ఉన్న తెలుగు విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ధైర్యం చెప్పారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లండన్‌లోని తెలుగు విద్యార్థులతో గౌతమ్ సవాంగ్ మాట్లాడారు. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, నిబ్బరం కోల్పోవద్దని వారికి సూచించారు.
భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు అండగా ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థులు డీజీపీకి వివరించారు. విద్యార్థుల సమస్యలు విన్న డీజీపీ.. వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారిస్తానని భరోసా ఇచ్చారు.
Also Read | రోడ్లపై ఒక్క వలస కూలీ లేరన్న కేంద్రం…వైరస్ కన్నా భయమే ఎక్కువమందిని చంపేస్తుందన్న సుప్రీం