ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇప్పట్లో శాంతించే పరిస్థితి కనిపించట్లేదు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా ప్రభావంతో లాక్ డౌన్ అయిన పరిస్థితి. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి రాబోయే మూడు నెలల్లో చూడబోతున్నట్లు ఇప్పటికే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో టెన్త్ విద్యార్ధులు పరీక్షల విషయంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
టెన్త్ క్లాస్ పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోగా.. దానికి తోడు మరో రెండు నెలల్లో కూడా సాధారణ పరిస్థితికి వచ్చే అవకాశం లేకపోవడంతో తర్వాత వెంటనే పరీక్షలు రాసి వాటి వ్యాల్యుయేషన్ జరిగి ఫలితాలు వచ్చి తరువాతి క్లాసులకు వెళ్లాలంటే చాలా పెద్ద తతంగమే.. ఈ క్రమంలో విద్యార్ధుల జీవితాలపై కాస్త ప్రభావం పడే అవకాశమూ ఉంది.
దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేసి విద్యార్థులకు ఇంటర్‌లో నేరుగా ప్రవేశం కల్పించాలంటూ ఏపీ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇప్పటికైతే విద్యార్థులందరినీ పాస్ చేయాలని, అవసరం అనుకుంటే ఇంటర్‌లో చేరే సమయంలో ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి, ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు నాగమధు యాదవ్ డిమాండ్ చేశారు.
విద్యార్థులను ప్రమోట్ చేసేందుకు కింది తరగతిలో వచ్చిన మార్కులు, పదో తరగతి హాజరును ప్రాతిపదికగా తీసుకోవాలని కాంగ్రెస్ కోరుతుంది. ఇప్పటికే తొమ్మిదవ తరగతి వరకు పరీక్షలు లేకుండా తర్వాతి క్లాసులకు పంపేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Also Read | COVID – 19 లాక్ డౌన్ : తెగ వాడేస్తున్నారు..చూస్తున్నారు