ఏపీ లో 12 మంది  ప్రభుత్వ ఉద్యోగులపై ఈసీ చర్యలు

  • Publish Date - May 4, 2019 / 03:21 PM IST

అమరావతి:  ఎన్నికల సంఘం, విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై వేటు వేస్తూనే వుంది. తాజాగా  సార్వత్రిక ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన 12మంది ప్రభుత్వ  సిబ్బందిపై ఈసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన విశాఖపట్నం ఆర్వో, ఏఆర్వో, తూర్పుగోదావరి జిల్లా మండపేట ఆర్వో, ఏఆర్వో,  నెల్లూరు జిల్లా కోవూరు ఆర్వో, ఏఆర్వో,  సూళ్లూరుపేట ఆర్వో, ఏఆర్వో, నూజివీడు ఆర్వో, ఏఆర్వోలపై క్రమశిక్షణ  చర్యలకు ఎన్నికల సంఘం ఆదేశించింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్వో, ఏఆర్వోలను  ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు అభియోగాల నమోదు కారణంగా ఎన్నికల సంఘం శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. మరికొందరు అధికారులపై ఈసీ క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం వుంది.

ప్రకాశంజిల్లా ఎర్రగొండ పాలెం, కలనూతలలో అనుమతి లేకుండా ప్రచారం చేస్తున్న టీడీపీ, వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. రీ పోలింగ్ కోసం అనుమతి లేకుండానే ప్రధాన పార్టీలైన టిడిపి , వైసీపీ లు ప్రచారం చేశాయి. ఇరుపార్టీలకు చెందిన వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. సైలెన్స్ పీరియడ్ లో ఆంక్షలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది.