సీఎం జగన్‌కు బాబు లేఖ : వరదల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం

  • Publish Date - September 1, 2019 / 08:17 AM IST

ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఇటీవలే వచ్చిన వరదలు, తదితర విషయాలను ఆయన లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్దేశ్వపూర్వక నిర్లక్ష్యంతో ప్రజలకు నష్టం జరిగిందన్నరాయన. ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చిన వరద ప్రవాహాలను సమర్థంగా నిర్వహించడంలో వైఫల్యం వల్లే నష్టం జరిగిందన్నారు. ప్రకాశం బ్యారేజీలో నీటిని ముందే తగ్గించకుండా మరో తప్పిదం చేశారని విమర్శించారు.

ఇటీవలే బాబు ఇంటిపై డ్రోన్‌లతో ఫొటోల విషయాన్ని కూడా లేఖలో తెలిపారు. తన ఇంటికి నోటీసు అంటించడం..డ్రోన్లు ఎగురేయడం చూపే ఆసక్తి..వరద బాధితుల కాపాడడంపై చూపితే..నష్టం జరిగేది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు బాబు. 

ఇటీవలే ఎగువన కురిసిన వర్షాలకు ఏపీ రాష్ట్రానికి భారీగా వరద పోటెత్తింది. జలాశయాలు నిండిపోయాయి. నాగావళి, వంశధార నదులకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో పలు ముంపు గ్రామాలు నీట మునిగాయి. ప్రధానంగా బాబు నివాసం వద్దకు వరద నీరు వచ్చింది. కృష్ణా కరకట్టపై ఆయన నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. వరద నీటిని వచ్చినదానిని వచ్చినట్లుగా కిందకు వదలకుండా..ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం ప్రమాద స్థాయికి చేరేలా వైసీపీ సర్కార్ వ్యవహరించిందని టీడీపీ ఆరోపణ.

దీనిని వైసీపీ ఖండించింది. ఈ వ్యవహారంపై టీడీపీ – వైసీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. సోషల్ మీడియాలోనూ ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. బాబు నివాసం ఉంటున్నది అక్రమమంటూ వైసీపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సీఎం జగన్‌కు బాబు రాసిన లేఖపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.