కరోనా కట్టడి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాధి నుంచి ఏపీ ప్రజలను కాపాడేందుకు సంచలన ఉత్తర్వు విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువ అవుతుండడంతో రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రులను ఆధీనంలోకి తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహణ, వైద్య సేవలు, రోగ నిర్ధారణ పరీక్షలు, ఇన్ పేషెంట్ సేవలు మొత్తం ప్రభుత్వ ఆధీనంలోకి రాబోతున్నాయి.
దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ బెడ్స్, రూమ్స్, వార్డులు, ఐసీయూ, వెంటిలేటర్లు, టెస్టింగ్ ల్యాబ్‌లు, ఫార్మసీలు, మార్చురీలు, ఇతర పరికరాలు అన్నింటినీ ప్రభుత్వం ఉపయోగించుకోబోతుంది. అవసరమైతే ఆస్పత్రుల్లో పనిచేసే ప్రత్యేక విభాగాలకు చెందిన వైద్యులను కూడా వాడుకోవాలని నిర్ణయించుకుంది.
ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. వైద్యులు, నర్సులు, మెడికల్, నాన్ మెడికల్ స్టాఫ్‌ను అవసరమైన సందర్భాల్లో ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల అధికారులు జిల్లా కలెక్టర్ లేదా, నియమితులైన ప్రత్యేక అధికారి ఆదేశాలను పాటించాలని ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో 1897 నాటి ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ అమలు చేస్తూ నిర్ణయాలుత తీసుకోగా ఇప్పుడు అదే దారిలో కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.
Also Read | సోషల్ డిస్టెన్స్…మానసిక సమస్యలకు కారణం అవుతోంది. మరి తట్టుకోవడమెలా?