హైపవర్ వరాలు: విశాఖకు వచ్చే ఉద్యోగుల కోసం!

  • Publish Date - January 10, 2020 / 06:19 AM IST

అమరావతి నుంచి విశాఖకు తరలివచ్చే ఉద్యోగుల ముందు హైపవర్ కమిటీ కీలక ప్రతిపాదనలు ఉంచేందుకు సిద్ధం అవుతుంది. అమరావతి నుంచి విశాఖ వెళ్లేందుకు ఉద్యోగులు ఆసక్తి చూపట్లేదు. ఈ క్రమంలో హై పవర్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రతిపాదనలు చేస్తుంది.

ఈ మేరకు భేటి నిర్వహించింది హై పవర్ కమిటీ. ఈ భేటీలో విశాఖకు తరలివచ్చే ఉద్యోగులకు కల్పించాల్సిన కీలక సౌకర్యాలపై చర్చలు జరిపారు. ఉద్యోగులు విశాఖకు వస్తే నామమాత్రపు ధరకే 200 గజాల స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇంటి నిర్మాణానికి రూ.25 లక్షల రుణం అందించేందుకు ప్రతిపాదనలు రెడీ చేసింది.

అంతేకాదు అమరావతి నుంచి ఇంటి సామాన్లు తరలించేందుకు ఉద్యోగి హోదాను బట్టి  రూ.50వేలు నుంచి రూ.1లక్ష వరకు చెల్లించాలని, ఉచిత వసతి సౌకర్యం కల్పించే దిశగా ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారు. కుటుంబం సహా తరలివస్తే రూ.4వేల రాయితీ కూడా చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

అలాగే ఇంతకుముందు అమరావతిలో ఇచ్చినట్లుగా విశాఖలోనూ బస్, రైలు ప్రయాణాల్లో రాయితీ ఇవ్వాలని, వారానికి 5 రోజుల పని దినాల ప్రతిపాదనలు రెడీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వాటితో పాటు మరిన్ని సౌకర్యాలను ఉద్యోగుల ముందు ఉంచేందుకు కమిటీ నిర్ణయించుకుంది.