ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన గ్రామ/వార్డు సచివాలయాల నియామక ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. అయితే మిగిలిపోయిన గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి అధికారులు సిద్ధం అయ్యారు. మిగిలిపోయిన పోస్ట్‌లకు సంబంధించి నోటిఫికేషన్ జారీచేయనుంది ప్రభుత్వం.
ఏపీలో మొత్తం లక్షా 94వేల 592 గ్రామ వాలంటీర్లను ప్రభుత్వం నియమించింది. అయితే వారిలో లక్షా 84వేల 944 మంది మాత్రమే విధుల్లో చేరారు. దీంతో 9వేల 648 పోస్ట్‌లు రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి వీలైనంత త్వరలో నోటిఫికేషన్ జారీచేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీచేయగా.. ఈ మేరకు ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను ప్రభుత్వానికి నివేదించారు అధికారులు.
ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం మొత్తం 9,648 ఖాళీల్లో.. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,861 పోస్టులుండగా.. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 200 ఖాళీలు ఉన్నాయి. నవంబరు ఆఖర్లోగా నియామక ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. దీనికి ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే నోటిఫికేషన్ రానుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షలకు పైగా గ్రామ/పట్టణ వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్వ్యూలు చేసి ఆగస్ట్‌లో వారిని నియమించారు. ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాను జిల్లాల వారీగా విడుదల చేశారు. అయితే ఎంపికైనవారిలో కొంతమంది నియామక పత్రాలు తీసుకోలేదు.. మరికొన్ని చోట్ల సరైన అభ్యర్థులు లేరు. దీంతో మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.