మాట నిలబెట్టుకున్నారు : ఏపీలో పెరిగిన హోంగార్డుల జీతాలు

  • Publish Date - October 13, 2019 / 03:06 AM IST

ఏపీ సీఎం జగన్ ఇచ్చిన మాటలను ఒక్కొక్కటిగా నిలబెట్టకుంటూ వస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను భర్తీ చేస్తూ ముందుకెళుతున్నారు. హోంగార్డుల జీతాల విషయంలో సీఎం జగన్ గతంలో హామీనిచ్చారు. అందులో భాగంగా వారి జీతాలను పెంచింది ఏపీ ప్రభుత్వం. అక్టోబర్ 12వ తేదీ శనివారం హోం శాఖ ముఖ్యకార్యదర్శి కేఆర్ఎం కిషోర్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంపై జూన్ 10వ తేదీన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో హోంగార్డుల వేతనం పెంపు నిర్ణయాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే.

ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెస్తూ..ప్రస్తుతం ఉన్న రోజువారీ వేతనం రూ. 600 నుంచి రూ. 710కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హోంగార్డుల నెలసరి జీతం రూ. 18 వేల నుంచి రూ. 21 వేల 300కు పెరుగుతుంది. పెంచిన వేతనాలను 2019, అక్టోబర్ 01వ తేదీ నుంచి అమల్లోకి రానుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలంటూ..ప్రభుత్వం డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయం పట్ల హోంగార్డులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

గతంలో జగన్ సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. హోం గార్డులు జగన్‌ను కలిసి..తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. వైసీపీ అధికారంలోకి వస్తే..తగిన న్యాయం చేస్తామని అప్పట్లో హామీనిచ్చారు. జీతం పెంచడంతో పాటు..సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం జీతాలు పెంచుతూ..ఉత్తర్వులు జారీ చేసింది. 
Read More : గ్రామ వాలంటీర్ పోస్టులు : సెకెండ్ నోటిఫికేషన్