ఏపీలో స్థానిక సమరం : మూడు దశల్లో ఎన్నికలు

  • Publish Date - May 3, 2019 / 03:15 PM IST

ఏపీ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. తొలి దశలో గ్రామ పంచాయతీలు..రెండో దశలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మూడో దశలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్నారు అధికారులు. బ్యాలెట్ విధానం ద్వారా గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. మున్సిపాల్టీ ఎన్నికలు మాత్రం ఈవీఎంల ద్వారా నిర్వహిస్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50 శాతం రిజర్వేషన్ల అమలు చేయనున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ సమీక్షించారు. ఏపీలో 13,060 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. గతంలో 60శాతం రిజర్వేషన్లను అమలు చేశామని, సుప్రీంకోర్టు 50శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయరాదని తాజాగా ఆదేశించిందని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లపై కొత్త ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్టు చెప్పారు.