విశాఖలో క్రాస్ ఓటింగ్ : JD గెలుస్తారా

  • Publish Date - April 18, 2019 / 01:23 PM IST

ఎన్నికలు ముగిశాయి.. ప్రజలు తీర్పు ఇచ్చేశారు.. ఇక ఎవరు గెలుస్తారు అనేదీ మరి కొద్ది రోజుల్లో తేలనుంది. అయితే అనూహ్యంగా పెరిగిన ఓటింగ్ తమకంటే తమకు మేలు చేస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో అనూహ్యంగా జరిగిన క్రాస్ ఓటింగ్ ఎవ్వరిని దెబ్బతీస్తుందో అర్ధంకాని పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే అభ్యర్ధులకు లభించిన ఓట్లలో .. ఎంపీ అభ్యర్ధులకు సగం అయినా వస్తాయో లేదో తెలియని పరిస్థితితో నేతలు టెన్షన్‌ పడుతున్నారు. 

విశాఖ జిల్లాలో మొత్తం 3 పార్లమెంట్ స్థానాలు, 15 అసెంబ్లీ స్థానాలున్నాయి. టీడీపీ, వైసీపీ, జనసేన అభ్యర్ధులు బరిలో ఉన్నారు. ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని అభ్యర్థులే చెబుతున్నారు. ప్రధానంగా విశాఖ పార్లమెంట్ స్థానం పరిధిలో ఈ క్రాస్ ఓటింగ్ ఎక్కువగా జరిగిందని తెలుస్తోంది. విశాఖ పార్లమెంట్ స్థానం కోసం టీడీపీ నుంచి గీతం యూనివర్సిటీ అధినేత, బాలకృష్ణ రెండో అల్లుడు శ్రీభరత్ , వైసీపీ నుంచి రియల్టర్, సినీ నిర్మాత ఎంవీవీవీ సత్యనారాయణ, బీజేపీ నుంచి మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరీ, జనసేన నుంచి మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు.
Also Read : హైదరాబాద్‌లో ఈడీ సోదాలు : రూ.82 కోట్ల విలువైన 146కిలోల బంగారం స్వాధీనం

టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎంపీ అభ్యర్ధికి కాకుండా జనసేన ఎంపీకి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు టాక్. జనసేన ఎంపీ అభ్యర్ధి లక్ష్మీనారాయణపై యువత, విద్యార్ధి, మధ్య తరగతి, ప్రభుత్వ వర్గాల్లో మంచి అభిప్రాయం ఉంది. విశాఖ పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో విద్యావంతులు, ఉత్తర భారతీయులు, కార్మిక వర్గం ఎక్కువగా ఉంది. సిటీ పరిధిలో టీడీపీ బలంగా ఉన్నా..ఆ పార్టీ ఎమ్మేల్యేకు ఒక ఓటు..తమకు నచ్చిన ఎంపీ అభ్యర్ధికి ఒక ఓటు వేసినట్లు తెలుస్తోంది. 

జనసేన అభ్యర్థి లక్ష్మీనారాయణ తన ఓన్ చరిష్మాతోనే ముందుకు వెళ్లారు. తెలుగుదేశం, వైసీపీ బలంగా ఉన్న చోట్ల ఎంపీ అభ్యర్థికి తమ పార్టీ వారికి కాకుండా.. తమకు నచ్చిన వారికి ఎక్కువగా ఓట్లు పడ్డాయి. విశాఖ ఉత్తరం, విశాఖ దక్షిణం, విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమంలో, భీమిలి, ఎస్.కోట, గాజువాకలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. విశాఖ దక్షిణం, విశాఖ పశ్చిమం, విశాఖ ఉత్తరం, గాజువాక నియోజికవర్గాల్లో కార్మిక సంఘాల ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఇక్కడే ఉత్తరాది వారు ఎక్కువగా ఉంటారు. గత ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్ధి హరిబాబుకు, విశాఖ ఉత్తర అభ్యర్ధి విష్ణుకుమార్ రాజుకు ఇదే పెద్ద ప్లస్ అయింది. అయితే ఇప్పుడు క్రాస్ ఓటింగ్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధులకు పోల్ అయిన దాంట్లో సగం కూడా ఎంపీ అభ్యర్ధికి పోల్ కావని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.

భీమిలి నియోజక వర్గంలో వైసీపీ ఎమ్మేల్యే అభ్యర్ధికి ఓట్లు పడ్డాయి. కానీ ఆ పార్టీ ఎంపీ అభ్యర్ధికి ఓట్లు పడలేదని ఆ పార్టీ ఏజెంట్లు చెబుతున్నారు. ఒక ప్రధాన పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్ధికి ఓటు వెయ్యొద్దని ఆ పార్టీ అధిష్టానం స్థానిక నేతలకు క్లీయర్‌గా అదేశాలు జారీ చేసిందని.. దానిలో భాగంగానే ఆ పార్టీ శ్రేణులు నగరంలో బలంగా ఉన్నా.. ఓట్లు మాత్రం ఎంపీ అభ్యర్ధికి పడలేదు.

అనకాపల్లి నియోజికవర్గ పరిధిలో అనకాపల్లి, చోడవరం, పెందుర్తి, మాడుగుల, పాయకరావు పేట, నర్సీపట్నం, ఎలమంచిలి నియోజికవర్గాలు ఉన్నాయి. టీడీపీ నుంచి విశాఖ డైయిరీ అధినేత అడారి తులసీరావు కుమారుడు ఆనంద్, వైసీపీ నుంచి డాక్టర్ సత్యవతి, జనసేన నుంచి మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్ధసారథి  బరిలో ఉన్నారు. ప్రధానంగా విశాఖ పార్లమెంట్ స్థానంతో పోల్చుకుంటే అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి ఎక్కువ  ఓటింగ్ శాతం నమోదు అయింది. ఇదే సమయంలో మహిళ ఓటింగ్ శాతం కూడా గతంలో కంటే ఎక్కువగా పెరిగింది.

ఎవ్వరికి వారు తమకు లాభం కలుగుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ ఎంపీ అభ్యర్ధి ఆడారి అనంద్‌కు పార్టీలకు అతీతంగా రైతులతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయా పార్టీల ఎమ్మెల్యే అభ్యర్ధులకు ఒక ఓటు .. అడారి ఆనంద్‌కు ఒక ఓటు వేసినట్లు చెబుతున్నారు. అయితే చోడవరం, మాడుగుల, నర్సీపట్నం అభ్యర్ధులతో ఉన్న విభేదాలతో.. ఇక్కడ మరీ ఎక్కువగా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఇక వైసీపీ అభ్యర్ధి డాక్టర్ సత్యవతికి కూడా మెటర్నెటీ డాక్టర్‌గా మంచి పేరు ఉంది. అమేరకు ఉన్న పేరు వల్ల కూడా క్రాస్ ఓటింగ్ ఎక్కువగా జరిగింది. జనసేన అభ్యర్ధి పార్థసారథి కేవలం పవన్ కళ్యాణ్ చరిష్మానే నమ్ముకున్నారు.
Also Read : మోడీ చాపర్ తనిఖీ చేసిన IAS ఆఫీసర్ సస్పెండ్