రాజధానిపై బొత్స సంచలన వ్యాఖ్యలు

  • Publish Date - October 17, 2019 / 01:08 PM IST

రాజధాని నిర్మాణం పై ఏర్పాటు చేసిన నిపుణలు కమిటీ కొద్ది రోజుల్లో రాష్ట్ర మంతా పర్యటించి నివేదిక  ఇస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం సీఎం జగన్ అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో రాష్ట్రంలో హౌసింగ్ స్కీంలపై, పేదలకు ఇల్లు ఇచ్చే అంశంపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశం లోమాట్లాడుతూ.. రాజధాని అంటే ప్రత్యేకించి ఒక వర్గానికో , ఒక ప్రాంతానికో  మేలు చేసేదిలాగా ఉండదని ఆయన అన్నారు. రాష్ట్రంలో రాజధాని అనేది ప్రజల అందరి అభిప్రాయం మేరకు ఉంటుందన్నారు. ఏ ఒక్క ప్రాంతానికో, ఏ ఒక్కకులానికో మేలు చేసేలా ఉండదని, రాజధాని ప్రాంతం పూర్తి పారదర్శకంగా ఉంటుందని బొత్స తెలిపారు. రాజధాని ప్రాంతంలో రైతులకు ఇవ్వాల్సిన కౌలును త్వరలో చెల్లిస్తామని మంత్రి చెప్పారు. 

రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తామని మంత్రి బొత్స చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మందిని అర్హులుగా గుర్తించామని మంత్రి అన్నారు. ప్రభుత్వ భూములు లేని చోట అవసరమైన మేరకు భూములు కొనుగోలు చేయాలని ఫ్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రధానమంత్రి అవాస్ యోజన పథకాన్ని లింక్ అప్ చేసి ఇళ్లు నిర్మిస్తామని బొత్స తెలిపారు. ఇల్లు ఇచ్చే ముందే వారి పేరున రిజిష్ట్రేషన్ చేసి ఇస్తామని తద్వారా వారికి వాటిపై పూర్తి హక్కులు లభిస్తాయని మంత్రి  వివరించారు.

పట్టణాల్లో ఒక సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తాం. జి-ప్లస్ తరహా కాకుండా అర్హులైన వారందిరికీ  ఇండిపెండెంట్‌ హౌసెస్‌ ఇస్తామని మంత్రి  తెలిపారు. టిడ్కో ద్వారా నిర్మించే 300 ఎస్ఎఫ్టీ ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా ఇస్తాం.  గత ప్రభుత్వ హయాంలో టిడ్కో పరిధిలో  చేపట్టిన  50వేల యూనిట్లకు రివర్స్ టెండరింగ్‌ త్వరలో చేపడతామని బొత్స తెలిపారు. విలేకరులకు ఇళ్లు ఇచ్చే అంశంపై ఇప్పటికి ఒకసారి సమావేశం జరిపామని , సబ్ కమిటీ భేటీ తర్వాత జర్నలిస్టుల ఇళ్ల స్ధలాలపై స్పష్టత ఇస్తామని బొత్సచెప్పారు.  ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హమీని సీఎం జగన్ అమలు చేస్తారని ఆయన తెలిపారు.