ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం లక్షా 9వేల కోట్లు ఇస్తే అమరావతిలోనే రాజధానిని నిర్మిస్తామన్నారు. కేంద్రం నుంచి నిధులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెస్తే ఆయన పేరుతోనే రాజధానిని నిర్మిస్తామన్నారు.
రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని బీజేపీ రాష్ట్ర కోర్ కమిటి చేసిన తీర్మానంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. జనవరి12, ఆదివారం విశాఖలో మాట్లాడుతూ మంత్రి…. ఆ పార్టీకి విలువలు లేకుండా పోవడానికి భిన్నాభిప్రాయాలే కారణమని అంటూ…రాష్ట్రంలో ఏదో అన్యాయం జరిగిపోతోందంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మినారాయణ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
రాజధాని రైతులకు సీఎం జగన్ న్యాయం చేస్తారని మంత్రి చెప్పారు. నిజమైన రైతులు దాడులు చేయరని…. గతంలో భూములు ఇవ్వమంటూ రైతులు పోరాటం చేసిన విషయం మర్చిపోకూడదని మంత్రి అన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీలకు అలవాటుపడే పవన్ అలా మాట్లాడుతున్నారని వెల్లంపల్లి తీవ్రస్థాయిలో విమర్శించారు.
విజయవాడలో జరుగుతున్న ఆందోళనలకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి మహిళల్ని తీసుకొస్తున్నారని వెల్లంపల్లి ఆరోపించారు. డబ్బులిచ్చి వారితో ఆందోళనలు చేయిస్తున్నారని..అలాంటి వారిపై మాత్రమే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారన్నారని వివరించారు. పోలీసులు నమోదుచేసిన కేసుల వివరాలు చూస్తే ఆ విషయం తెలుస్తుందన్నారు. రాజధాని అమరావతిలోనే కొనసాగాలని ఆందోళనలు చేసే వారిలో బడా భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రమే ఉన్నారని వెల్లంపల్లి ఆరోపించారు