పవర్ అండ్ పాలిటిక్స్ : ఏపీలో పొలిటిక్స్ అప్ డేట్

  • Publish Date - January 24, 2019 / 12:52 PM IST

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రస్తవత్తరంగా మారిపోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్లస్‌లు మైనస్‌లు లెక్కలు వేసుకుంటున్నాయి. టికెట్ కోసం ఆశిస్తున్న నేతలు వివిధ పార్టీల్లోకి జంప్ అయిపోతున్నారు. టీడీపీ నుండి వైసీపీలోకి..వైసీపీ నుండి టీడీపీలోకి..లేకపోతే కాంగ్రెస్..ఇలా పార్టీ నేతలు కండువాలు కప్పుకొనేందుకు సిద్ధమౌతున్నారు. జనవరి 24వ తేదీ గురువారం మాత్రం ఏపీలో రాజకీయాలు మాత్రం హీట్ ఎక్కాయనే చెప్పవచ్చు.
ప్రధానంగా వంగవీటి ఎపిసోడ్‌ ఉత్కంఠకు తెరపడింది. ఏ పార్టీలో చేరడం లేదని వంగవీటి చెబుతూనే వైఎస్ఆర్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలకు దిగారు. ఆ పార్టీలో ప్రజాస్వామ్యం లేదని…జగన్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు వంగవీటి. 
వైఎస్ఆర్ కాంగ్రెస్ : ఈ పార్టీకి మాత్రం దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆదిశేషగిరిరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. జనవరి 24వ తేదీ చంద్రబాబుతో భేటీ అయ్యారు. పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నా…పార్టీ అధినేత జగన్ మాత్రం హైదరాబాద్ నుండే రాజకీయ పరిణామాలపై దృష్టి సారిస్తున్నారు. ‘అన్న పిలుపు’ పేరిట కార్యక్రమం నిర్వహించాలని జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన తటస్థ ఓటర్లకు లేఖలు అందించారు. స్వయంగా వీరందరినీ కలవాలని జగన్ డిసైడ్ అయ్యారు. దీనిద్వారా పార్టీకి ప్లస్ అవుతుందని జగన్ భావన. 
టీడీపీ : ఇక టీడీపీ విషయానికి వస్తే..ఈ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో లబ్ది పొందే విధంగా కార్యచరణ రూపొందిస్తున్నారు. నేతల మధ్య నెలకొన్న విభేదాలను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. జమ్మలమడుగు పంచాయతీ పరిష్కరించేందుకు బాబు ట్రై చేస్తున్నారు. కడప ఎంపీ…జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేయాలనే దానిపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటానిని..అంతవరకు సైలెంట్‌గా ఉండాలని నేతలకు సూచించారు బాబు. కాపు రిజర్వేషన్లపై వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీ వైఖరి చెప్పాలని సీఎం చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. రాష్ట్ర వ్యాప్తంగా పసుపు కుంకుమ పేరిట రూ. 10వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 
కాంగ్రెస్ : ఈసారి ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతుందని కాంగ్రెస్ చెప్పడంపై నేతల్లో బిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఏకంగా కర్నూలు సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్ర కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ‘చేయి’ వీడడానికి సిద్ధమయ్యారని ప్రచారం జరిగింది. టీడీపీతో పొత్తు లేకపోతే కాంగ్రెస్‌కి తీవ్ర నష్టం జరుగుతుందని కోట్ల వాదిస్తున్నారు. కోట్లను చేజారనివ్వకుండా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. 
జనసేన : ఇక జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన కొనసాగుతోంది. జనవరి 26, 27వ తేదీల్లో షెడ్యూల్ ఖరారు చేసింది. 25వ తేదీన విశాఖపట్టణంలో జనసేన, కమ్యూనిస్టు అగ్రనేతల రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. సీపీఎం తరపున రాఘవులు, సీపీఐ తరపున సురవరం సుధాకర్ రెడ్డిలు..ఇతర కీలక నేతలు పవన్‌తో సమావేశం కానున్నారు. జనవరి 26,27వ తేదీల్లో గుంటూరు జిల్లాలో పవన్ పర్యటించనున్నారు. జనవరి 27వ తేదీన గుంటూరులో జనసేన శంఖారావం నిర్వహించనుంది. 
మొత్తంగా చూస్తే ఏపీలో పొలిటికల్ హీట్ డే బై డే రసవత్తరంగా మారుతున్నాయి.