ఏపీ పవర్ పొలిటిక్స్ : రాజకీయాలు రసవత్తరం

  • Publish Date - January 25, 2019 / 12:45 PM IST

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడానికి నెల రోజుల సమయం ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి రగులుకొంది. ప్రధాన పార్టీ టీడీపీ..ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్…అధికారంలోకి రావాలని యోచిస్తున్న జనసేన పార్టీలు పక్కా స్కెచ్‌‌లు వేస్తున్నాయి. మీటింగ్‌లు..సభలు…చర్చలు…నిర్వహిస్తూ ఆయా పార్టీల అధినేతలు ఫుల్ బిజీగా మారిపోతున్నారు. 
టీడీపీ : ప్రధానంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందే ఉన్నారని చెప్పవచ్చు. ప్రజలను ఆకర్షించే విధంగా వరాల జల్లు కురిపిస్తున్నారు. ఆయన ఎన్నికల శంఖారావం పూరించారు. జనవరి 25వ తేదీ శుక్రవారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఏపీ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ‘పసుపు – కుంకుమ’ పేరిట రూ. 21, 116 కోట్లు అందచేశామని…రాబోయే రెండు నెలల్లో ఒక్కో డ్వాక్రా మహిళ బ్యాంకు ఖాతాలో రూ.10వేలు చొప్పున జమ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. వెలుగు ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నట్లు…ఇన్ని సంక్షేమ పథకాలు చేపట్టిన తనకే ఓటు వేయాలని అడిగే హక్కు ఉందని..టీడీపీ రాకపోతే అభివృద్ధి ఆగిపోతోందని..సంక్షేమం నిలిచిపోతుందని బాబు చివరగా హెచ్చరించారు. 
వైఎస్ఆర్ కాంగ్రెస్ : ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా టీడీపీకి ధీటుగా ప్రణాళికలు రచిస్తోంది. పార్టీ ప్రతిష్ట..నేతల సఖ్యత కోసం జగన్ జిల్లాల టూర్‌కి సిద్ధమౌతున్నారు. కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధమౌతోంది. ఇప్పటికే తటస్థ ఓటర్లకు జగన్ లేఖలు రాసిన సంగతి తెలిసిందే. బీసీలను తమవైపు ఆకట్టుకోవడానికి టీడీపీ నిర్వహించే సభకు ధీటుగా రాజమండ్రిలో సభ నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ స్కెచ్ వేస్తోంది. 
జనసేన : ఎన్నికలో తమదైన మార్కును చూపించాలని తహతహలాడుతున్న జనసేనానీ అందుకనుగుణంగా సైలెంట్‌గా ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఉత్తరాంధ్ర నేతలు..ఇతర సంఘాలతో మీటింగ్‌లు జరిపిన పవర్ స్టార్…సీపీఎం, సీపీఐ జాతీయ నేతలైన రాఘవులు..సురవరం..నేతలతో చర్చించారు. ఇప్పటికే తమ పార్టీ లెఫ్ట్ వారితోనేనని ప్రకటించిన పవన్…ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు. తదుపరి చర్చలు ఫిబ్రవరిలో జరుగుతాయని పవన్ వెల్లడించారు. 
మొత్తంగా ఏపీ రాష్ట్రంలో మాత్రం పవర్ అండ్ పొలిటిక్స్ మాత్రం వేగంగా జరుగుతున్నాయి.