సరిహద్దులో సేవలు అందించే సైనికుడు. శత్రువులను తరిమికొట్టే బాధ్యతాయతుమైన పదవిలో ఉండి, సెలవులకు ఇంటికి వచ్చి దొంగతనాలకు పాల్పడ్డాడు. నెల రోజుల పాటు సెలవులపై ఇంటికి వచ్చి తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, దొంగతనాలకు పాల్పడి చివరకు పోలీసులకు చిక్కాడు.
వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేట గ్రామానికి చెందిన షేక్ సోహెల్ 2015వ సంవత్సరంలో సైనికుడిగా విధుల్లో చేరాడు. 2017వ సంవత్సరంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన చోరీ కేసులో జైలు జీవితం అనుభవించాడు. అనంతరం మళ్లీ ఉద్యోగంలో చేరాడు. సెప్టెంబరు 4న సెలవులపై గ్రామానికి వచ్చిన సోహెల్.. కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని గురురాఘవేంద్ర కాలనీ, భిక్కనూరు పోలీసుస్టేషన్ పరిధిలోని జంగంపల్లిల్లో చోరీలకు పాల్పడ్డాడు.
మాచారెడ్డి మండలం గజ్యానాయక్‌తండాలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై వస్తున్న సోహెల్ పోలీసులను చూసి పారిపోయాడు. దీంతో వెంబడించిన పోలీసులు అతనిని పట్టుకున్నారు. తర్వాత అతడిని విచారించగా పలు దొంగతనాలు చేసినట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని కామారెడ్డి ఎస్పీ శ్వేత విలేకర్ల సమావేశం నిర్వహించి వెల్లడించాడు.
నిందితుడి నుంచి మూడు తులాల బంగారు నెక్లెస్, అర తులం బంగారు ఉంగరం, 130 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.17వేల నగదు, ఎయిర్ పిస్టల్, కత్తి, అయిదు ఖాళీ కాట్రిడ్జ్‌లు, అయిదు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. సోహెల్ చెడు వ్యసనాల బారిన పడి చోరీలకు పాల్పడినట్లు తెలుస్తుంది.