అదే మాట : పవన్ ఎవరో తెలియదన్న అశోక్ గజపతి రాజు

  • Publish Date - January 28, 2019 / 05:13 AM IST

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతి రాజు మరోసారి హాట్‌ కామెంట్స్ చేశారు. ఇప్పుడీ కామెంట్స్‌.. రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. గతంలో ఓ సారి అశోక్‌ గజపతికి పవన్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తాజా వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

సినిమాలు చూసే అలవాటు లేదు 
చిరంజీవి తెలుసు.. వాళ్ల నాన్న తెలుసు 
టీటీడీ ఈవో సింఘాల్ నియమాకాన్ని తప్పుపట్టిన పవన్
అశోక్‌గజపతిరాజుకు నేనెవరో తెలియకపోవచ్చు – పవన్
అణగారిన ప్రజలకు నేనెవరో తెలుసు- పవన్
అశోక్‌గజపతి రాజు కామెంట్స్‌పై జనసైనికుల ఆగ్రహం

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఎవరో తనకు తెలియదని మరోసారి అన్నారు మాజీ కేంద్రమంత్రి అశోక్‌ గజపతి రాజు. పవన్ కల్యాణ్ సినిమా నటుడు అంటున్నారని, తాను సినిమాలు చూడనని చెప్పారు. పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి తెలుసు. పవన్ కళ్యాణ్ వాళ్ల నాన్న కూడా నాకు తెలుసన్నారు. ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్నప్పుడు పవన్ తండ్రి ఒక పనికోసం తన వద్ద కొస్తే చేసిపెట్టినట్లు చెప్పారు. 

గతంలో ఇదే అంశంపై అశోక్‌గజపతి రాజు, పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కూడా.. పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదన్నారు అశోక్‌ గజపతి రాజు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించడంపై పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. ఓ ఉత్తరాది వ్యక్తిని టీటీడీ ఈవోగా నియమించడమేంటని పవన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు స్పందించారు. పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదన్నారు. టీటీడీ ఈవో ఎంపికపై తాను స్పందించనని అన్నారు.

తానెవరో తెలియదన్న టీడీపీ ఎంపీ అశోక్‌గజపతిరాజుపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సెటైర్ వేశారు. అశోక్‌గజపతిరాజుకు తానెవరో తెలియకపోవచ్చు కానీ.. అణగారిన ప్రజలకు తానెవరో తెలుసని చెప్పారు. అటు అశోక్ గజపతిరాజు కామెంట్స్ పై అప్పట్లో జనసైనికులు, పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడానికి కీలకపాత్ర పోషించిన పవన్ తెలియదా అంటూ మండిపడ్డారు. అశోక్‌ గజపతి రాజు తాజా మాటలు విన్న జనసేన కార్యకర్తలు, మెగాభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇప్పటికే పలుమార్లు గజపతి వ్యాఖ్యలకు కౌంటరిచ్చిన పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలకు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.