పరిస్థితులు మారిపోయాయి. అబ్బాయిలు ఇప్పటివరకు అమ్మాయిలను లైంగికంగా వేధించారు అనే మాటలను వింటున్నాం. వార్తలు చదువుకున్నాం కదా? కానీ ఇప్పుడు అబ్బాయిలను కూడా కొంతమంది అబ్బాయిలు వదలట్లేదు. ఈ విషయం లేటెస్ట్‌గా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ గురుకులాల్లో అబ్బాయిలే అబ్బాయిలను వేధిస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు ఎక్కువగా అందుతున్నాయి.
గ్రామీణ విద్యార్థుల కోసం ప్రభుత్వం సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖల ద్వారా గురుకులాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు వీటిలో ఎక్కువగా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని 192గురుకులాల్లో 1,07,832మంది విద్యార్థులు చదువుతున్నారు.
అయితే ఇక్కడే అబ్బాయిలు ఇబ్బందులు పడుతున్నారు. సాంఘీక సంక్షేమ హాస్టల్లలో ఒక్కో గదిలో సుమారు 40 మంది ఉంటారు. రాత్రిళ్లు పక్కపక్కనే నిద్రపోతున్నారు. యుక్తవయస్సులో హార్మోన్ల ప్రభావంతో కొందరు విద్యార్థులు అదుపు తప్పిపోతున్నారు. ముఖ్యంగా 9వతరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు కింది తరగతుల పిల్లలను లైంగికంగా వేధిస్తున్నట్లు విద్యార్థులు తల్లిదండ్రులకు చెబుతున్నారు.
ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు ఎక్కువగా అందుతున్నాయి. గురుకులాల్లో ఫోన్‌లు వాడడం నిషేధం అయినా కూడా కొంతమంది విద్యార్ధులు ఎవరికీ తెలియకుండా ఫోన్లు వాడుతున్నారు. ఆ ఫోన్లలో నీలి చిత్రాలను చూడడం వల్ల ఇటువంటి అఘాయిత్యాలకు అబ్బాయిలు పాల్పడుతున్నారు.