ఇది సినిమా కథ కాదు: ఫేస్‌బుక్ సాయంతో కన్నవారి చెంతకు కూతురు

  • Publish Date - December 8, 2019 / 04:36 AM IST

సోషల్ మీడియా సాయంతో ఎటువంటి అసాధ్యమైనా సుసాధ్యం చేయవచ్చు అనేదానికి నిదర్శనం ఈ సంఘటన. మంచి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు సోషల్ మీడియా అద్భుత సాధనం అని నిరూపించాడు విజయవాడకు చెందిన ఓ వ్యక్తి. అతని పేరు వంశీధర్ బచ్చు. సోషల్ మీడియా సాయంతో ఓ కుటుంబానికి ఓ అమ్మాయిని దగ్గర చేశాడు. ఎక్కడో సినిమాల్లో చూస్తుంటాము కదా? చిన్నప్పుడు తప్పిపోయిన పిల్లలు పెద్దయ్యాక కలవడం.. అదే దైవేచ్ఛ.

ఆ అమ్మాయికి అందరి పేర్లూ గుర్తుండడం.. ఊరిపేరు గుర్తు ఉండడం.. కాలిమీద కాలిన మచ్చ ఉండడం… ఇలాంటి విషయాలను కనుక్కొని నాలుగేళ్ల వయసులో కుటుంబానికి దూరమైన ఓ బాలిక పదిహేనేళ్ల తర్వాత కుటుంబానికి దగ్గరైంది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం చీపురుపల్లికి చెందిన మాధవరావు, వరలక్ష్మీ దంపతులు జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్నారు. అప్పుడే వారి నాలుగున్నరేళ్ల కూతురు భవానీ తప్పిపోయింది. ఎంతో వెతికారు ఫలితం దక్కలేదు.

ఇదే సమయంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన జయరాణి హైదరాబాద్‌లో ఇంటి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది. తప్పిపోయిన భవానీ జయరాణికి కనిపించింది. బాలిక గురించి చుట్టుపక్కల వారిని ఆరా తీసినా ఫలితం లేకపోయింది. దీంతో చిన్నారిని తనతోపాటు తీసుకెళ్లి, ఆమె కోసం ఎవరైనా వస్తే తనకు తెలియజేయాలంటూ సనత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో వివరాలు ఇచ్చింది. తర్వాతి కాలంలో ఆమె భవానీతో సహా విజయవాడకు చేరుకుంది.

ఇంటి పనులు చేసుకుంటూనే జయరాణి ఇద్దరు కుమార్తెలతో కలిసి విజయవాడలో నివాసం ఉంటోంది. తన కన్న కూతుళ్లను చదవించకపోయినా భవానీని ఇంటర్మీడియట్ వరకు చదివించింది. తాను పనిచేసే ఇంట్లోనే భవానీని కూడా పనిలో పెట్టాలనే ఉద్దేశంతో జయరాణి వంశీ, అతని భార్య కృష్ణకుమారికి ఆమెను పరిచయం చేసింది. అయితే పదిహేనేళ్ల తర్వాత విజయవాడ పడమటలంక వసంత సదన్‌ అపార్ట్‌మెంట్‌లో ఉండే వంశీధర్‌ బచ్చు కుటుంబం చొరవతో తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది భవానీ.

చిన్నప్పుడే తల్లిదండ్రుల నుంచి తప్పిపోయానని భవానీ చెప్పడంతో.. భవానీ కుటుంబసభ్యుల వివరాలను ఫేస్‌బుక్‌ ఆధారంగా తెలుసుకున్నారు వంశీధర్ బచ్చు. ఈ క్రమంలోనే భవానీ కన్నవారు మాధవరావు, వరలక్ష్మీ, సోదరులు సంతోష్‌, గోపి విజయవాడకు చేరుకున్నారు. ఇదిలా ఉంటే కన్నవారిని కలుసుకున్న సంతోషం ఓవైపు.. ఇన్నేళ్లు తనను కంటికిరెప్పలా కాపాడి, పెంచి పెద్దచేసిన తల్లిని వదిలి వెళ్లాలంటే కలిగే బాధ మరోవైపు భవానీ ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది. పెంచిన తల్లి జయరాణి మాత్రం భవానీ ఇష్టానికే నిర్ణయాన్ని వదిలేసింది. కానీ, ఆమె భర్త జీవరత్నం మాత్రం పెంచిన కూతురిని వదులుకునేందుకు ఇష్టపడలేదు.