ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటికి దగ్గరలో పేలుడు సంభవించింది. ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని తాడేపల్లిలో ఉన్న బ్రహ్మానందపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అత్యంత కట్టుదిట్టమైన సెక్యురిటీ ఉండే సీఎం జగన్ ఇంటికి సమీపంలో ఉన్న ఇంట్లో గ్యాస్ సిలిండర్ కారణంగా పేలుడు సంభవించింది.
పేలుడు దెబ్బకు ఇంటి పై కప్పుతో సహా గోడలన్నీ ఎగిరి పడ్డాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న పింకీ అనే యువతికి తీవ్రగాయాలు అవగా ఆమెను ఆస్పత్రికి తరలించారు. యువతికి కంటి చూపు పోయినట్లుగా తెలుస్తుంది.
సీఎం జగన్ ఇంటికి సమీపంలోనే ఘటన జరగడంతో జగన్ ఇంటి దగ్గర ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. అయితే తర్వాత విషయం తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. సదరు ఇంట్లో బాణసంచా తయారు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. టపాసులు పేలి తర్వాత గ్యాస్ సిలిండర్‌కు మంటలు అంటుకోగా గ్యాస్ సిలిండర్ పేలింది.
ఇంట్లో బాపట్ల శివశంకర్.. తన భార్య, ముగ్గురు కుమార్తెలతో కలిసి ఉంటున్నారు. శివశంకర్ తాపీ పని చేస్తుండగా.. ఇంట్లో కుటుంబసభ్యులు నేల టపాకాయలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే శివశంకర్ రెండో కూతురు పింకీ టపాకాయలు తయారు చేస్తుండగా ప్రమాదం జరిగింది.