మెరుపు కన్ను మూసి తెరిచేంతలో మాయం అయిపోతుంది. మెరుపు తోడు పిడుగు కూడా పడితే ఆ ప్రాంతంలో కళ్లుమిరుమిట్లు గొలిపే వెలుగుతో విధ్వంసమే జరుగుతుంది. కానీ పిడుగు పడాలంటే వాతావరణంలో పెను మార్పులు సంభవించాలి. మేఘాలు దట్టంగా కమ్ముకోవాలి, మెరుపులు మెరవాలి, ఉరుములతో వర్షం పడాలి. ఈ సంకేతాలు అన్నీ ఉన్నప్పుడు పిడుగు ఖణఖణమంటూ ఆకాశంలోంచి నేల మీద పడుతుంది పిడుగు.
చలి పిడుగు అని, నిప్పుల పిడుగు అని రెండు రకాలుగా పిడుగులు పడతాయి అంటారు. కానీ ఉరుములు..మెరుపులు ఏమీ లేకుండానే వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు పిడుగు పడటం చాలా చాలా అరుదు. అటువంటి ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అక్కడ జోరు వాన లేదు, మేఘాలు, ఉరుములు, మెరుపులూ వంటివి ఏవీ లేవు. కానీ..ఓ ఇంటి దగ్గర ఉన్న పామాయిల్ చెట్టు మీద హఠాత్తుగా పిడుగు పడింది. ఒక్కసారిగా మంటలు వచ్చినట్టే వచ్చి క్షణాల్లోనే భారీ శబ్దం వచ్చి పిడుగు మాయమైపోయింది. ఇంతా క్షణాల్లో జరిగిపోయింది.
ఈ పిడుగు పడ్డప్పుడు జొనాథన్ మూరే అనే వ్యక్తి కారులో ఉన్నాడు. ఆయనకు 75 అడుగుల దూరంలోనే పిడుగు పడింది. కారులోని డ్యాష్‌క్యామ్‌లో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
ఈ ఘటనపై మూరే మాట్లాడుతూ.. ఆ పిడుగు చెట్టు కాండాన్ని నిలువునా చీల్చేసిందనీ తెలిపారు. ఉరుములు..మెరుపులు లేకుండా పడిన ఈ పిడుగు గురించి వాతావరణ శాఖ అధికారులు మాట్లాడుతూ.. ఇటువంటి పిడుగును బ్లూ బోల్ట్ అంటారని.. వర్షాల సమయంలో పడే పిడుగులను థండర్ బోల్ట్ అంటారని వెల్లడించారు. బ్లూ బోల్ట్‌లు కూడా మేఘాల నుంచే వస్తాయని.. వాటి మెరుపు కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్లాక పిడుగులా పడుతుందని వివరించారు. దూరం నుంచి రావడంవల్ల అది మెరవకుండా, అరవకుండా వచ్చేస్తుందని అన్నారు.