నేడు జగన్ కు నివేదిక ఇవ్వనున్న బోస్టన్ సంస్ధ

  • Publish Date - January 3, 2020 / 01:40 AM IST

ఏపీ రాజధాని ఏర్పాటులో సాంకేతిక అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ శుక్రవారం, జనవరి3న  సీఎం జగన్ కు నివేదిక సమర్పించబోతోంది. ఇందులో రాజధాని నిర్మాణానికి ఏ ప్రాంతం అనువుగా ఉంటుంది, అక్కడ సానుకూలతలు ఏమున్నాయి, వనరుల లభ్యత ఎలా ఉందన్న అంశాలను ప్రభుత్వానికి బీసీజీ నివేదించనుంది. దీన్ని జీఎన్ రావు కమిటీ నివేదికతో కలిపి మంత్రులు, అధికారులతో కూడిన హై పవర్ కమిటీ పరిశీలించి జనవరి నెలాఖరు కల్లా తుది నివేదిక ఇస్తుంది.
 

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం త్వరలోనే తేలిపోనుంది. రాజధాని ఏర్పాటు విషయంలో సాంకేతిక అంశాలను పరిశీలించేందుకు ఏర్పాటైన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నేడు ప్రభుత్వానికి తమ నివేదిక సమర్పించనుంది. ఇందులో విశాఖలో కార్వనిర్వాహక రాజధాని, అమరావతిలో చట్టసభల రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు విషయంలో సానుకూలతలు, ప్రతికూలతలను సాంకేతిక కోణంలో పరిశీలించి తగు సూచనలు, సలహాలు ఇవ్వనుంది. గతంలో వివిధ రాష్ట్రాల్లో రాజధానుల ఏర్పాటు సందర్భంగా తీసుకున్న జాగ్రత్తలు, అందులో ఆయా ప్రభుత్వాల ప్రాధాన్యతలను కూడా బోస్టన్ గ్రూప్ తమ సాంకేతిక నివేదికలో పొందుపర్చినట్లు తెలుస్తోంది. 
 

సాధారణంగా రాజధాని లేదా ప్రముఖ నగరాల నిర్మాణంలో భవిష్యత్తులో అక్కడ పెరిగే జనాభా, మానవ వనరుల లభ్యత, ఆ ప్రాంతం ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుటుందా లేదా అన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. వీటి ఆధారంగానే భవిష్యత్ ప్రణాళికలు ఖరారు అవుతాయి. దీంతో ఏపీ రాజధాని ఏర్పాటు విషయంలోనూ ఈ సాంకేతిక నివేదిక కీలకం కాబోతోంది. గతంలో జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ పట్టణ మౌలిక సదుపాయాల కల్పన కోణంలో రాజధానుల ఏర్పాటును ప్రభుత్వానికి సూచించింది. ఇప్పుడు అదే అంశాన్ని సాంకేతిక కోణంలో బీసీజీ నివేదించే అవకాశముంది. తద్వారా ప్రభుత్వానికి తుది నిర్ణయం తీసుకునే విషయంలో ఈ రెండు నివేదికల సారాంశం కీలకంగా మారబోతోంది.

 
ఇప్పటికే 10 మంది మంత్రులు, ఆరుగురు ఉన్నత అధికారులతో నియమించిన హై పవర్ కమిటీ జీఎన్ రావు కమిటీ నివేదికను పరిశీలించేందుకు సిద్దమవుతోంది. నేడు బీసీజీ రూపొందించిన సాంకేతిక నివేదిక కూడా అందితే ఈ రెండింటినీ కలిపి హై పవర్ కమిటీ పరిశీలించనుంది. బీసీజీ నివేదికను ఈ నెల 8న జరిగే కేబినెట్ భేటీలో కూడా చర్చకు పెడతారు. అనంతరం హై పవర్ కమిటీ ఈ నెల 20న ముఖ్యమంత్రికి నివేదిక అందించనుంది. సంక్రాంతి తర్వాత జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం హై పవర్ కమిటీ నివేదికను చర్చకు పెట్టి ఆమోదించనుంది. ఈ సమావేశాల్లోనే మూడు రాజధానులపై తుది ప్రకటన వచ్చే అవకాశముంది. 
 

Also Read : రాయపాటిపై కేసు నమోదు చేసిన ఈడీ