బ్రహ్మాండోత్సవం : తిరుమల బ్రహ్మోత్సవాలు

  • Publish Date - September 29, 2019 / 01:07 AM IST

తిరుమలేశుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా అంకురార్పణ జరగనుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలతో తిరుమల దేదీప్యమానంగా వెలిగిపోతోంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాల కోసం ఏడుకొండలను ఇల వైకుంఠాన్ని తలపించేలా అలంకరించింది టీటీడీ. మాడ వీధుల్లో లక్షలాది మంది భక్తులు స్వామివారి వాహన సేవను తిలకించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 30 నుంచి జరగనున్నాయి. ఈ ఉత్సవాలు అక్టోబరు 8 వరకు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల ముందు రోజు వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణ కార్యక్రమం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించడమే ఈ కార్యక్రమం. ఇందులో భాగంగా శ్రీవారి సేనాధిపతి అయిన విశ్వక్సేనుడు నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అనంతరం భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి.. పుట్టమన్నులో నవధాన్యాలను నాటుతారు. అవి మొలకెత్తే వరకు నీరు పోస్తారు. ధాన్యాలను మొలకెత్తించే కార్యక్రమం కాబట్టి దీన్ని అంకురార్పణగా పిలుస్తారు. అంకురార్పణ ఘట్టం తర్వాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు.

మొక్కలకు అధిదేవుడు చంద్రుడు కాబట్టి.. రాత్రి సమయంలోనే ధాన్యాలను నాటడం చేస్తారు. అవి బాగా మొలకెత్తితే ఉత్సవం విజయవంతానికి సూచికగా భావిస్తారు. అనంతరం కొన్ని క్రతువులు నిర్వహించి.. తర్వాతి రోజు ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అక్టోబరు 8న చక్రస్నానంతో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులూ మలయప్పస్వామి వివిధ రకాల వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ఉదయం 9 నుంచి 11గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు స్వామికి వాహనసేవలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్ పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.

> సెప్టెంబర్ 30న పెద్దశేష వాహనం
> అక్టోబరు 1న చిన్నశేష వాహనం. హంస వాహనం, 
> అక్టోబరు 2న సింహవాహనం, ముత్యపు పందిరి వాహనం
> అక్టోబరు 3న కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం
> అక్టోబరు 4న మోహిని అవతారం, గరుడ వాహనం
> అక్టోబరు 5న హనుమంత వాహనం, గజవాహనం
> అక్టోబరు 6న సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం
> అక్టోబరు 7న స్వర్ణ రథం, అశ్వ వాహనం

అక్టోబరు 8న చక్రస్నానం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత గలిగిన గరుడ సేవ అక్టోబరు 4న జరగనుంది. స్వామికి అత్యంత ప్రీతిపాత్రుడైన గరుడుడిపై ఉన్న స్వామిని దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
Read More : ఆధ్యాత్మిక పరిమళాలు : ఇంద్రకీలాద్రిపై ఉత్సవ శోభ