విభజన సమస్యలకు త్వరలో పరిష్కారం

  • Publish Date - October 10, 2019 / 03:43 AM IST

తెలుగు రాష్ట్రాల్లోని విభజన సమస్యలకు త్వరలోనే చెక్ పడనుంది. పలు అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. దాదాపు ఏడాది తర్వాత ఢిల్లీలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మధ్య చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఎల్వీ సుబ్రమణ్యం, ఎస్.కె.జోషిలు హాజరయ్యారు. అక్టోబర్ 09వ తేదీ మంగళవారం నాడు జరిగిన ఈ చర్చల్లో.. పోలీసు అధికారుల ప్రమోషన్లు, షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజన చర్చకు వచ్చాయి.

ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్ల ప్రమోషన్లు జోన్ల ప్రకారం చేపడుతామని, డీఎస్పీ స్థాయికి వెళ్తేనే కామన్ ప్రమోషన్ల కిందకు వస్తుందని, ప్రీ జోన్‌లో ఎక్కువ మంది ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే ఉన్నారని..కేటాయింపుల ప్రకారం ప్రమోషన్లు ఇస్తామని తెలంగాణ వాదించింది. దీనికి కేంద్ర హోం శాఖ అంగీకరించలేదు. ప్రీజోన్ అనేది కొత్తగా వచ్చిందని కాదని, హైకోర్టు ఆదేశాల ప్రకారం సీనియార్టినీ నిర్దారించాలన్న ఏపీ వాదనతో హోం శాఖ ఏకీభవించింది. ఆ మేరకు సీనియార్టిని నిర్దారించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. 

9వ షెడ్యూల్‌లోని ఆస్తుల విభజనపై కూడా సమావేశంలో చర్చించారు. హైదరాబాద్‌లో ఆస్తుల విభజన జరగాలని..ఏపీ మొదటి నుంచి పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇరు సీఎస్‌ల వాదనలను కేంద్ర హోం శాఖ కార్యదర్శి విన్నారు. సింగరేణి కాలరీస్‌కు సంబంధించి విభజన చట్టంలోనే లోపాలున్నాయని ఏపీ ప్రభుత్వం వాదించింది. షెడ్యూల్ 9 ప్రకారం సింగరేణి సంస్థను విభజించాలని, ఆస్తుల నిష్పత్తి ప్రాతిపదికన తెలంగాణకు బదలాయించాలని కోరింది. చట్ట ప్రకారం ఏం చేయాలో పరిశీలించి తగిన నిర్ణయాన్ని ప్రకటిస్తామని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. 
Read More : వైయస్ఆర్ కంటి వెలుగు: జగన్ చేతుల మీదుగా ప్రారంభం