పవన్ కళ్యాణ్‌తో లాలూచీ లేదు.. అందుకే గాజువాకలో ప్రచారం చేయలేదు: చంద్రబాబు

విశాఖలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశాల్లో గాజువాక నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు ప్రజలలో చైతన్యం కలిగించేలా కార్యక్రమాలు చేపట్టాలని అక్కడి నాయకులకు సూచించారు. ఈ సంధర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. జనసేన అధినేత ఉద్దేశంతో ఎన్నికల సమయంలో గాజువాకకు ప్రచారానికి రాలేదని చెప్పారు చంద్రబాబు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో విభేదించడం వల్ల పార్టీ పరంగా నష్టపోయామని, అందువల్ల రాష్ట్రానికి లాభం జరగలేదని, పార్టీకి నష్టం జరిగిందని అన్నారు చంద్రబాబు. ప్రజలను నమ్ముకున్నాం.. ప్రయోజనం పొందినవారు సహకరించలేదని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి తప్పులు చేయకుండా ఉండేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు.
ఇదే సమయంలో గాజువాకలో ఎన్నికలపుడు పర్యటించకపోవడంపై టీడీపీ కార్యకర్తల్లో సందేహం ఉందని మాజీ కార్పోరేటర్ ప్రసాదుల శ్రీనివాస్ ప్రశ్నించగా.. పవన్ కళ్యాణ్‌తో హుందాతనం ప్రదర్శించాలని ‘ఒకవేళ ఏదైనా ఆలోచన చేస్తే బహిరంగంగా పొత్తు పెట్టుకునేవాళ్లం. గాజువాకలో నేను పర్యటించకపోవడం వల్ల టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుకు కొంత ఇబ్బంది ఎదురైంది.
నేను పర్యటించి ఉంటే కొన్ని ఓట్లు పెరిగి ఉండేవి. గాజువాకలో మన అభ్యర్థి శ్రీనివాసరావు బాగా పనిచేశారు. పవన్ కల్యాణే గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది’ అని అన్నారు. తమకు ఎవరితోనూ లాలూచీ లేదని, అలా ఉంటే బహిరంగంగానే పొత్తు పెట్టుకునేవాళ్లమని అన్నారు.