నంద్యాలను జిల్లా చేస్తా : టీడీపీని గెలిపించు రెడ్డి

  • Publish Date - March 27, 2019 / 04:36 AM IST

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలవేళ చంద్రబాబు కొత్త జిల్లాల ప్రకటన అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన ప్రకటన రాజకీయంగా చర్చకు దారితీస్తుంది. ఎపీలో ఎన్నికల తర్వాత కొత్త జిల్లాలు రావచ్చు అంటూ కొన్నిరోజులుగా వార్తలు వస్తుండగా.. చంద్రబాబు నంద్యాల సభలో మాట్లాడుతూ నంద్యాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తానని ప్రకటించారు. నంద్యాల జిల్లాగా కావాలనేది ప్రజల ఆకాంక్ష అని, నంద్యాలను జిల్లాగా చేయాలంటే కుప్పం కంటే మెజారిటీ తెప్పించాలని ఆయన పిలుపునిచ్చారు.
అంతేకాదు నంద్యాలకు ఔటర్ రింగ్ రోడ్డును ఏర్పాటు చేస్తామని, స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు పాటుపడతానని చెప్పారు. అలాగే నంద్యాలలో ఇటీవల జనసేనలో చేరిన ఎంపీ ఎస్పీవై రెడ్డికి ప్రజా వేదికగా చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. నంద్యాలలో టీడీపీ విజయానికి ఎస్పీవై రెడ్డి సహకరించాలని, అలా చేస్తే కుటుంబానికి గౌరవప్రదంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు.

నంద్యాలను జిల్లా చేస్తానంటూ చంద్రబాబు హామీతో ప్రజల్లో చర్చ జరుగుతుంది. జిల్లా చేస్తే అభివృద్ధి సాధ్యం అవుతుందని.. కొత్తగా ఆఫీసులు వస్తాయని.. ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు. ఎస్పీవై రెడ్డికి ఓపెన్ ఆఫర్ ఇవ్వటంపైనా చంద్రబాబు వ్యూహం ఉంది అంటున్నారు.