తెలుగుదేశం పార్టీలో చీమ చిటుక్కుమన్నా.. అక్కడ అధికార వైసీపీ నేతలకు తెలిసిపోతోంది. బాబు గారొస్తారు.. ప్రతి రోజు కాసేపు ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడతారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఒకప్పుడు గుర్తింపు పొందిన టీడీపీలో అంతర్గత విషయాలు అస్సలు బయటకు పొక్కేవే కాదు. కానీ, ఇప్పుడు మాత్రం.. బాబు గారి కాన్ఫరెన్స్ ముగియగానే మెయిన్ పాయింట్స్ ప్రత్యర్థులకు చేరిపోతున్నాయి. ఇప్పుడు ఆ పని చేస్తున్నదెవరనే దానిపై టీడీపీలో నిఘా పెట్టారట. మరి ఇంటి దొంగ ఎవరో దొరికే అవకాశం ఉందా?
రాజకీయ పార్టీలలో టీడీపీకి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. తెలుగువారిపై ఢిల్లీ నాయకుల పెత్తనాన్ని సహించని ఎన్టీఆర్ ఆనాడు పార్టీని స్థాపించారు. పార్టీలో బలహీనవర్గాలకు అవకాశం కల్పిస్తూ ఒక క్రమశిక్షణ నెలకొల్పారు. పార్టీ అంటే ప్రాణం తీసుకునే క్యాడర్ టీడీపీకే సొంతం. అలాంటి పార్టీలో నేడు క్రమశిక్షణ కొరవడుతోందని అంటున్నారు. పార్టీలో నేతలంతా బృందాలుగా విడిపోయి గ్రూప్ పాలిటిక్స్ చేసుకుంటున్నారట. ఇదంతా ఒక ఎత్తయితే పార్టీ అంతర్గత వ్యవహారాలు సైతం ప్రత్యర్థి పార్టీలకు చేరవేస్తూ కొందరు పార్టీకి ద్రోహం చేస్తున్నారనే టాక్ ఇప్పుడు సంచలనంగా మారింది.
ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీని ఇప్పుడిప్పుడే పట్టాలు ఎక్కించే పని ప్రారంభించారు అధినేత చంద్రబాబు. దీనికి ఆదిలోనే హంసపాదు అన్నట్లు రోజు వారీ జరిగే నేతల సమావేశాల వివరాలు, పార్టీ అధినేత నిర్వహించే టెలికాన్ఫరెన్స్ వివరాలు నిమిషాల వ్యవధిలోనే ప్రత్యర్థి పార్టీలకు చేరవేస్తునట్టు పార్టీ హైకమాండ్ గుర్తించింది. చంద్రబాబు ప్రతి రోజు ఉదయం పది, పన్నెండు వేల మంది ముఖ్య నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి, నాయకుల దగ్గర్నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో ముఖ్యమైన నేతలు కూడా పాల్గొంటూ వైసీపీ నాయకులకు సంబంధించిన కీలకమైన విషయాలు వెల్లడిస్తుంటారు.
పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాలనే కార్యక్రమానికి ప్రభుత్వం అక్రమ మార్గాలలో భూమిని సేకరిస్తోంది. వైసీపీ నేతల జోక్యం, తదితర కీలక అంశాలు ఈ సందర్భంగా టెలికాన్ఫరెన్స్‌లో ఓ మాజీ మంత్రి లేవనెత్తినట్టు సమాచారం. త్వరలోనే అన్ని సాక్ష్యాలు సేకరించి, మీడియాకు విడుదల చేయాలని అధినేత ఆదేశించారు. తర్వాత గంటలోనే మాజీ మంత్రికి ఆ జిల్లాకు చెందిన కీలక అధికారి ఫోన్ చేశారట. అంతా పారదర్శకంగానే జరుగుతోందని, ఏమైనా అనుమానాలుంటే నివృత్తి చేస్తామని చెప్పడంతో ఆ మాజీ మంత్రి అవాక్కయ్యారట. తాను టెలికాన్ఫరెన్స్‌లో లేవనెత్తిన అంశాలు ఆ అధికారికి ఎలా తెలిశాయా అని ఆ మాజీ మంత్రి తెగ టెన్షన్ పడుతూ, మిగతా నేతలతో చెప్తే ఎవరికి వారు తమకు ఎదురైన అనుభవలను కూడా చెప్పుకున్నారట.
టీడీపీలో కీలక సమాచారం బయటకు పోవటం ఇది కొత్తేమీ కాదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. 2004 నుంచి 14 వరకు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీలో ఇంటి దొంగల నుంచి సమాచారం బయటకు వెళ్లేదని చెబుతున్నారు. వైఎస్ హయాంలో కొందరు టీడీపీ నేతలు అంతర్గత సమావేశాల సమయంలో ఫోన్లు ఆన్ చేసి పెట్టేవారని, ఇది తెలిసిన అధినేత చంద్రబాబు.. జాగ్రత్త పడి ఫోను బయటపెట్టి రావాలనే కండిషన్ పెట్టారట. 2009 ఎన్నికల ముందు రెండు రూపాయలకు కిలో బియ్యం మేనిఫెస్టోలో పెట్టాలని పార్టీ నేతలతో చంద్రబాబు చర్చించగానే అది లీక్ అయి వైఎస్ ప్రభుత్వం వెంటనే అమలు చేసిందంటూ ఓ ఉదాహరణగా టీడీపీ నేతలు చెబుతున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా టీడీపీ నేతలు పార్టీ అంతర్గత విషయాలను ప్రత్యర్థి పార్టీలకు చేరవేశారట. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసు సందర్భంగా కొంతకాలం చంద్రబాబు సమావేశాలకు ఫోన్లను అనుమతించ లేదు. ఇప్పుడు పార్టీ అధినేత నిర్వహిస్తున్న టెలీ కాన్ఫరెన్స్‌లో కూడా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయినవారు, వేరే పార్టీలో బాధ్యతలు నిర్వహిస్తున్న వారికి కూడా ఫోన్లు వెళ్తున్నాయట. పార్టీ నుంచి రాజీనామా చేసి బయటకు వెళ్లిన వారికి సంస్థాగత ఎన్నికల పరిశీలకులుగా నియమించినట్లు సమాచారం. దీంతో వారు పార్టీలో తాము లేమని ఆన్సర్ చెప్పటంతో అవాక్కవుతున్నారట నేతలు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు.. ఇంటిదొంగలను పట్టుకొనేందుకు వ్యూహరచన చేస్తున్నారట.