చిరుత దాడి: భయంతో వణుకుతున్న గ్రామస్ధులు

  • Publish Date - February 4, 2019 / 12:58 PM IST

రాజమహేంద్రవరం: అరణ్యాలకు ఎంతో దూరంలో ఉండే తూర్పుగోదావరి జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో ఓచిరుతపులి సంచారం స్ధానికులను  భయభ్రాంతులకు గురి చేసింది.  తూర్పు  గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో పంట పొలాల్లో సోమవారం నాడు చిరుతపులి ప్రవేశించి రైతులపై దాడి చేసింది. చిరుత దాడిలో ముగ్గురు రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. 

గాయపడిన రైతులు కేకలు వేశారు. సమీప ప్రాంత రైతులు వచ్చి చిరుత కోసం వెదికే సమయంలో చిరుతపులి కొబ్బరిచెట్టు ఎక్కి కూర్చుంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచార మిచ్చిన పోలీసులు చిరుతపులి ఉన్న సమీప ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా పర్యవేక్షిస్తున్నారు.  చిరుత కిందకు దిగి దాడి చేస్తందనే భయంతో గ్రామస్తులు మారణాయుధాలు, కర్రలతో సిధ్ధంగా ఉన్నారు.