నేటి నుంచి సినిమా ధియేటర్లు ప్రారంభం… చైనాలో

  • Publish Date - July 20, 2020 / 01:10 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చైనాలో మూత పడిన సినిమా ధియేటర్లు దాదాపు 6 నెలల తర్వాత ఈ రోజు తెరుచుకోనున్నాయి. వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనేటి నుంచి( జులై 20) ధియేటర్లలో సినిమాలు ప్రదర్శించనున్నారు. చైనా లో కరోనా వైరస్ ఉధృతి తగ్గిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా అధికార యంత్రాంగం ప్రకటించింది. ఆరు నెలల పాటు సినిమా స్టూడియోలు, ధియేటర్లు మూసి వేయటంతో సినిమా రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడింది.

కాగా సినిమా ధియేటర్లలో కోవిడ్ రక్షణ చర్యలు తప్పని సరిగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రేక్షకులు హాలులోనికి వెళ్లే ముందే స్క్రీనింగ్ టెస్ట్ లు చేయడం, శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవటం,మాస్కు ధరించటం తప్పని సరి చేసింది. ధియేటర్ సిబ్బంది కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. మాస్క్ లేని వారికి పాప్ కార్న్,కూల్ డ్రింక్ అమ్మరాదని ప్రకటించింది. ధియేటర్ మొత్తం కెపాసిటీలో 30 శాతం సీట్లకు మాత్రమే లోనికి అనుమతించాలంది. హాలులో ప్రదర్సించే సినిమా నిడివి 2 గంటలు మాత్రమే ఉండాలని కూడా తెలిపింది. ధియేటర్లలో ప్రదర్శించే సినిమాలుక ఎట్టి పరిస్ధితుల్లోనూ రాయితీలు ఇవ్వబోమని చైనా ప్రభుత్వం ప్రకటించింది.

చైనాలో సినిమాలకు ప్రపంచంలో రెండో అతి పెద్ద మార్కెట్ ఉంది. 2019 లో చైనాలో బాక్సాఫీస్ 2లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే ప్రభుత్వం ఇన్ని నిబంధనలు పెట్టి ధియేటర్లు తెరవటానికి అనుమతిస్తే ఇదివరకటి అంత మార్కెట్ ఉండదని స్ధానిక వ్యాపార వేత్తలు అంచనా వేస్తున్నారు. మాస్క్ లు పెట్టుకుని సినిమా చూస్తే ప్రేక్షకులు సినిమా చూసినా అనుభూతికి లోను కారేమో అనే అనుమానం వారు వ్యక్తం చేస్తున్నారు.