అహోబిలంలో హైటెన్షన్ : అఖిల ప్రియ భర్తకు గాయాలు

  • Publish Date - April 11, 2019 / 04:45 AM IST

రాయలసీమలో పోలింగ్ టెన్షన్ ఉంది. ఆళ్లగడ్డ నియోజకవర్గం అహోబిలంలో టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య కొట్లాట జరిగింది. అహోబిలంలో భూమా – గంగుల వర్గీయులు రాళ్లు రువ్వుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అఖిల ప్రియ భర్తకు గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. పోలీస్ బలగాలు కూడా మోహరించాయి.

రాళ్ల దాడిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేశారు పోలీసులు. విషయం తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి భూమా అఖిల ప్రియ స్పాట్ కు వచ్చారు. సున్నితమైన ప్రాంతాల్లో ఒకటైన అహోబిలంలో భద్రత ఏర్పాట్లు చేయటంలో విఫలం అయ్యారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారామె. ఘర్షణ తలెత్తడంతో ఓటర్లు  భయాందోళనలకు గురయ్యారు.

ఈ నియోజ‌క‌వ‌ర్గంలో  గంగుల – ఎస్వీ – భూమా కుటుంబాల‌దే రాజ‌కీయ అధిప‌త్య పోరు. అఖిల ప్రియ తన తండ్రితో కలిసి వైసీపీ నుండి టీడీపీలో చేరారు. తర్వాత అఖిలప్రియ మంత్రి పదవి వరించింది. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన గంగుల ప్రభాకర్ రెడ్డి.. వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. గంగుల సోదరుడు ప్రతాప రెడ్డి కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు.