విజయవాడ : ఏపీ రాజధాని అమరావతి త్వరలో మరో తిరుమలగా మారనుంది. అత్యంత సుందరంగా..సమ్మోహనంగా భారీ ఎత్తున వెంకన్న ఆలయాన్ని నిర్మించేందుకు సర్కారు రెడీ అయిపోయింది. 2019, జనవరి 31వ తేదీ గురువాం సీఎం చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. ఆలయ నిర్మణానికి సంబంధించి భూకర్షణం, బీజావాపనం కోసం బాబు ప్రత్యేక పూజలు చేశారు. గర్భగుడి ప్రాంతంలో నాగలితో దున్ని నవధాన్యాలు చల్లారు. టీటీడీ నుంచి వచ్చిన వేదపండింతులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. తిరుమల పెద్ద జీయంగార్ స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ప్రభుత్వం సేకరించిన 25 ఎకరాల భూమి టీటీడీ ఆధీనంలోకి తీసుకుంది. రూ.150 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన టెంపుల్ నిర్మాణానికి భూమి పూజ చేస్తారు.
వెంకటపాలెం దగ్గర 25 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. 5 ఎకరాల్లో ఆలయాన్ని నిర్మిస్తారు. మిగిలిన 20 ఎకరాల్లో కళ్యాణ మండపాలు, ఆలయ నిర్వహణకు, భక్తులకు అవసరమైన ఏర్పట్లకు తగిన నిర్మాణాలు, పార్కులు నిర్మిస్తారు. ఈ టెంపుల్ నిర్మాణానికి సంబంధించి డిజైన్స్ కూడా ఓకే అయ్యాయి
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆలయ ప్రదేశంలో వసంతోత్సవం, స్నపన తిరుమంజనం, చతుర్వేద పారాయణం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 2న చతుర్వేద పారాయణం, స్నపన తిరుమంజనం, ఫిబ్రవరి 3న బుగ్వేద పారాయణం, భక్తి సంగీతం, ఊంజల్ సేవ, ఫిబ్రవరి 4న యజుర్వేద పారాయణం, భక్తి సంగీతం, ఊంజల్ సేవ, ఫిబ్రవరి 5న సామవేద పారాయణం, భక్తి సంగీతం, ఊంజల్ సేవ, ఫిబ్రవరి 6న అధర్వణవేద పారాయణం, భక్తి సంగీతం, ఊంజల్ సేవ, ఫిబ్రవరి 7న ఆచార్యవరణం, అంకురార్పణ, ఫిబ్రవరి 8న చతుర్వేద పారాయణం, యాగశాల కార్యక్రమం, ఫిబ్రవరి 9న చతుర్వేద పారాయణం, యాగశాల కార్యక్రమం, ఫిబ్రవరి 10న చతుర్వేద పారాయణం, యాగశాల కార్యక్రమం, మీనలగ్నం నందు ప్రధమ శిలేష్టకాన్యాసము, పూర్ణాహుతి, వేదాశీర్వాద కార్యక్రమాలు నిర్వహిస్తారు. తిరుమల తిరుపతి తరువాత ఆ స్థాయిలో వెంకన్న ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.