దశలవారిగా మద్యపానాన్ని నిషేధించాలని కంకణం కట్టుకున్న సీఎం జగన్.. మందుబాబులకు షాకుల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే మద్యం ధరలు పెంచారు. మద్యం
దశలవారిగా మద్యపానాన్ని నిషేధించాలని కంకణం కట్టుకున్న సీఎం జగన్.. మందుబాబులకు షాకుల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే మద్యం ధరలు పెంచారు. మద్యం విక్రయాల సమయాన్ని తగ్గించారు. బార్ల సంఖ్యను సగానికి తగ్గించాలని, బార్లలో మద్యం సరఫరా సమయాలను కూడా కుదించాలని నిర్ణయించారు. తాజాగా సీఎం జగన్ మరో షాక్ ఇచ్చారు.
కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో మద్యపాన నిషేధంపై చర్చించిన సీఎం జగన్.. రిటైల్ షాపుల ద్వారా అందించే మద్యం బాటిళ్ల సంఖ్యను తగ్గించాలని సూచించారు. వినియోగదారులకు రిటైల్ షాపుల నుంచి ఒకరికి ఒక బాటిల్ మాత్రమే ఇచ్చేలా నిబంధనలు సవరించాలన్నారు. అయితే మద్యాన్ని విపరీతంగా కంట్రోల్ చేయడం వల్ల టూరిజం దెబ్బతినే అవకాశం ఉందని మంత్రి అవంతి అభిప్రాయం వ్యక్తం చేశారు. టూరిజం కోసం కాదు సమాజం కోసం ఆలోచించాలని సూచించారు సీఎం జగన్. కుటుంబాలతో టూర్ కి వెళ్లే వాళ్లు మద్యపానం చేయరు అని చెప్పారు.
మద్యం రేట్లు బాగా పెరిగాయని కొందరు మంత్రులు ప్రస్తావించగా… ఏం ఫర్వాలేదు మద్యపానం తక్కువవుతుందని సీఎం చెప్పారు. అవసరమైతే ధరలు మరింత పెంచే ఆలోచన చేయాలన్నారు. ఏపీలో సంపూర్ణంగా మద్యపానంపై నిషేధం విధిస్తామని ఎన్నికల హామీలో సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. మద్యపాన నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం నిర్ణయాల పట్ల మహిళల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.