మళ్లీ ఢిల్లీకి సీఎం జగన్

  • Publish Date - October 20, 2019 / 12:52 PM IST

ఏపీ సీఎం జగన్ మరోసారి ఢిల్లీకి వెళుతున్నారు. 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం ఉదయం 10గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణం కానున్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ ముగిసిన తర్వాత నేరుగా గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు సీఎం జగన్. ఢిల్లీకి చేరుకున్న అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం సీఎం కార్యాలయం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్‌తో పాటు ఇతర మంత్రులను కలిసే అవకాశం ఉంది. 

పెండింగ్‌ నిధులను విడుదల చేయాలని, రాష్ట్ర సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం 9, 10 షెడ్యూల్‌కు సంబంధించి సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, అపరిష్కృతంగా ఉన్న వాటిని పరిష్కరించాలని ఆయన మంత్రులను కోరనున్నారు. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్, దీనికి సంబంధించిన నిధులను విడుదల చేయాలని మంత్రి షెకావత్‌ను కోరనున్నారు. 

ఇటీవలే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.  అక్టోబర్ 05వ తేదీ శనివారం హస్తినకు వెళ్లిన ఆయన..ప్రధాన మంత్రితో భేటీ అయ్యారు. రైతు భరోసా కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించాలనుకుంటున్న జగన్.. ఆ మేరకు ఆహ్వానం అందించారు. ఏపీలో చేపడుతున్న అనేక సంక్షేమ కార్యకమాల వల్ల ఆర్ధిక భారం అదనం అవుతోందని, కేంద్రం తక్షణమే స్పందించి ఆర్ధిక సాయం చేస్తే.. కొంత వరకు రిలీఫ్ లభిస్తుందని మోడీ దృష్టికి తీసుకొచ్చారు. 

ట్రెండింగ్ వార్తలు