ఏపీ కేబినెట్ : మత్స్యకారులకు రూ. 10 వేలు, న్యాయవాదులకు రూ. 5 వేలు

  • Publish Date - October 16, 2019 / 09:24 AM IST

ఏపీ కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. అక్టోబర్ 16వ తేదీ బుధవారం ఉదయం సీఎం జగన్ అధ్యక్షతనలో జరిగిన ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైఎస్సార్ చేనేత నేస్తం పేరిట ఆర్థిక సాయానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతి సంవత్సరం చేనేత కార్మికుడికి రూ. 24 వేల ఆర్థిక సాయాన్ని సర్కార్ అందించనుంది. ప్రతి ఏడాది డిసెంబర్ 21న చేనేత కార్మికుడి ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు.

ఒకే విడతగా రూ. 24 వేలు చేనేతకు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా 90 వేల చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకానికి రూ. 216 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. టీడీపీ అడ్డగోలుగా విమర్శలు చేస్తోందని, ప్రభుత్వంపై టీడీపీ నేతలు దుష్ర్పచారం చేస్తున్నారని మంత్రులు వ్యాఖ్యానించారు. అంశాల వారీగా టీడీపీ, బాబు చేసే విమర్శలకు కౌంటర్ ఇవ్వాలని సీఎం జగన్ సూచించారు. వారు తప్పుడు ప్రచారం చేస్తే..సరిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఇసుక కొరత, ఇబ్బందులపై ఏపీ మంత్రివర్గం చర్చించింది. ఇసుక రవాణా కోసం వివిధ కార్పొరేషన్ల ద్వారా 6 వేల వాహనాల కొనుగోళ్లకు, మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వేట నిషేధం సమయంలో ఆర్థిక సాయాన్ని రూ. 4 వేల నుంచి రూ. 10 వేలకు పెంచింది. అలాగే న్యాయవాదులకు రూ. 5 వేలు ప్రోత్సాహకం ఇవ్వాలని, రూ. 46 వేల 675 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 
Read More : ఏపీలో కొత్త పథకం : చేనేత కుటుంబాలకు రూ.24వేలు సాయం