పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లాలో ప్రచారం చేసేందుకు రాగా ఆయనను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు సభ వద్దకు వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలను కుర్చీలతో తరిమికొట్టే ప్రయత్నం చేశారు. వెంటనే ఎదురుదాడికి దిగిన టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలపై రాళ్లు రువ్వారు.
ఈ ఘటన సూర్యాపేట జిల్లా పీక్లానాయక్ తాండాలో చోటుచేసుకుంది. ఉద్రిక్తతను ఆపేందుకు అక్కడికి వచ్చిన పోలీసలు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఎటువంటి ఇబ్బందికర ఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మరోవైపు తెలంగాణ పరిషత్ రెండవ విడతల ఎన్నికలు కొనసాగుతున్నాయి. 179 జడ్పీటీసీ, 1850 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కును వాడుకుంటున్నారు. 2వ విడత ఎన్నికల్లో భాగంగా 180 జెడ్పీటీసీ, 1913 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. ఒక జెడ్పీటీసీ, 63 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 179 జెడ్పీటీసీ, 1850 ఎంపీటీసీ స్థానాలకు ఎల్లుండి పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. బ్యాలెట్ పేపర్‌ల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు.