ఫోని తుఫాన్ : సిక్కోలు APEPDCL అధికారుల కాసుల దాహం

  • Publish Date - May 9, 2019 / 01:27 AM IST

తుఫాన్‌ వచ్చిన ప్రతీసారి కాసులు వెనకేసుకోవడం అలవాటు చేసుకున్న APEPDCL అధికారులు ఫోని తుఫాన్‌లోనూ అదే తీరును కొనసాగిస్తున్నారు. అడ్డదారులు తొక్కుతూ అధిక నష్టాన్ని చూపిస్తున్నారు. తక్కువ సంఖ్యలో కూలిన విద్యుత్‌ స్తంభాలను ఎక్కువగా చూపడం, ఇతర మెటీరియల్‌ను కొనుగోలు చేసినట్టు లెక్కలు రాయడం.. లేని జనరేటర్లకు, క్రేన్లకు రోజుకు వేలల్లో అద్దె చెల్లించినట్టు చూపడంలాంటి అక్రమాలకు తెర తీశారు. ఈ మాయాజాలంతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొట్టగొట్టేందుకు శ్రీకాకుళం జిల్లా ఏపీఈపీడీసీఎల్‌ అధికారులు రెడీ అయిపోయారు. 

ఫోని తుఫాన్‌ శ్రీకాకుళం జిల్లాకు భారీ నష్టాన్నే మిగిల్చింది.  ముందస్తు అంచనాల ప్రకారం తుఫాన్‌ పెను విధ్వంసాన్ని సృష్టిస్తుందని భావించారు. అయితే ఆ స్థాయిలో కాకపోయినా కొంతమేరకు నష్టాన్ని అయితే మిగిల్చింది. నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించే పనిలో అధికార యంత్రాంగంతోపాటు ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ కూడా పాలుపంచుకుంది. పెనుగాలులకు విద్యుత్‌ స్తంభాలు కూలితే… వాటి స్థానంలో కొత్తవి వేయడానికి దాదాపు 12వేల పోల్స్‌ను, ఇతర సామాగ్రిని సిద్ధం చేసింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే అధికారుల కాసుల దాహం బయటపడింది.

ఇతర జిల్లాలో ఉన్న 16 స్తంభాల తయారీ సంస్థల నుంచి 5,789 విద్యుత్‌ స్తంభాలను తరలించినట్టు రికార్డుల్లో పేర్కొన్నారు. అయితే 5,789 స్తంభాల్లో సగం కూడా ఆయా ప్రాంతాలకు పంపలేదు. కానీ వీటన్నిటినీ తరలించినట్టుగా రికార్డులు సృష్టించారు. తరలింపుకు అయ్యే రవాణా ఖర్చును కొట్టేయాలని ప్లాన్‌ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు… కొన్నాళ్ల తర్వాత ఈ విద్యుత్ స్తంభాలను తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పాతినట్టు రికార్డులు సృష్టించి భారీగా ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసేందుకు ప్లాన్‌ వేశారు. 6 నెలల క్రితం సంభవించిన తిత్లీ తుఫాన్‌లోనూ ఇలాగే చేశారని… వీరి అవినీతి గురించి తెలిసిన వారు చెబుతున్నారు.  ఫోని తుఫాన్‌కు శ్రీకాకుళం జిల్లాలో 2,129 స్తంభాలు దెబ్బతిన్నట్లు అధికారులు లెక్కలు రాశారు. కానీ వీటిలో సగం కూడా దెబ్బతినలేదని తెలుస్తోంది. 

తుఫాన్‌ నాటికి ముందస్తుగా రోజుకు 25వేల అద్దె చెల్లించి మండలానికి 14 క్రేన్ల వంతున రప్పించినట్టు అధికారులు రికార్డుల్లో రాశారు. ఇందుకు అడ్వాన్సులు కూడా ఇచ్చేశారు. అయితే వీటిలో నాలుగోవంతు కూడా గమ్య స్థానానికి చేర్చకుండా ఎక్కడివక్కడే ఉంచేశారు. కానీ రికార్డుల్లో మాత్రం వీటిని అద్దెకు తీసుకువచ్చినట్టు, అద్దె చెల్లించినట్టు చూపించారు. ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని 2వేల మంది లేబర్‌కు 2 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించేందుకు మన అవినీతి అధికారులు సిద్ధమైపోయారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపితే విద్యుత్‌ స్తంభాల కొనుగోలు, తరలింపు బాగోతం బయటపడుతుందని చెబుతున్నారు. మరి ఉన్నతాధికారులు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.