రూ. 36 లక్షలు మెక్కేశారు :  చిత్తూరు ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు

  • Publish Date - August 31, 2019 / 05:43 AM IST

మాజీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో భారీ అవినీతి బయటపడింది. బి.కొత్తకోటలో ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు వెలుగు చూశాయి. సామాజిక తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. సిబ్బంది కుమ్మక్కై రూ. 36 లక్షలు స్వాహా చేశారని అధికారులు నిర్ధారించారు. వెలుగు ప్రాజెక్టు ఏపీఎం హరినాథ్‌తో సహా..నలుగురు సీసీలు, 15 మంది సంఘ మిత్రాలను ఉన్నతాధికారులు సస్పెన్షన్ చేశారు. 

అవినీతి, అక్రమాలపై డ్వామా ఏపీడీ అధికారి శ్రీనివాస ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019, ఆగస్టు 30వ తేదీ శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సామాజిక బహిరంగసభ జరిగింది. బీరంగి, బి.కొత్తకోట, గుమ్మసముద్రం, బయ్యప్పగారిపల్లెలో అక్రమాలు జరిగాయని నిర్ధారించారు. ఒకే భూమిలో ఐదుగురు మొక్కలు పెంచారని, ఐదు బిల్లులు చెల్లించారని..లేని మొక్కలు ఉన్నట్లు చూపించినట్లు తేలింది.

ఇష్టానుసారంగా బిల్లులు ఇవ్వగా కొందరు రైతు బిల్లుల విషయం తమకు తెలియదని సభలో వెల్లడించారు. వెలుగు సిబ్బంది గాలిలో మేడలు కట్టారని శ్రీనివాస ప్రసాద్ వ్యాఖ్యానించారు. పనులు చూడకుండానే బిల్లులు వేశారని..ఏపీఎంతో సహా సీసీలు, సంఘ మిత్రలు నిధుల దుర్వినియోగం చేశారని..వీరంతా ఇక విశ్రాంతి తీసుకోవాల్సిందేనంటూ సభలో ప్రకటించారు.