టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయన్ను ఏలూరు జిల్లా జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న చింతమనేని సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం దెందులూరులోని ఆయన ఇంటికి వచ్చారు. 12 రోజుల నుంచి ఆయన కోసం గాలిస్తున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల నుంచి ప్రతిఘటన ఎదురైంది. చివరకు అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరు పరిచారు పోలీసులు.
అయితే..తాను ఏ తప్పు చేయలేదంటున్నారు చింతమనేని. తనపై ఆరోపణలు గుప్పించిన మంత్రి బోత్సకు సవాల్ విసిరారు. రుజువు చూపిస్తే తన ఆస్తిని పేద ప్రజలకు రాసిస్తానని..లేనిపక్షంలో మంత్రి పదవిని వదులుకోవాలని సవాల్ విసిరారు. పార్టీకి చెందిన కార్యకర్తలపై వేధిస్తున్నారని ఆరోపించారు.
దళితులను కులం పేరిట దూషించారనే కేసుతో సహా ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. 20 ఏళ్లలో 50 కేసులకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారమే ఉదయమే చింతమనేని ఇంటికి చేరుకున్న పోలీసులు..ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు.