దగ్గుబాటి ఫ్యామిలీలో భిన్నాభిప్రాయాలు : అమ్మ నాన్న మధ్యలో హితేశ్

  • Publish Date - January 28, 2019 / 01:11 AM IST

విజయవాడ : దగ్గుబాటి పురందేశ్వరి త్వరలో బీజేపీకి బైబై చెప్పనున్నారా? తాను రాజకీయాల నుంచి తప్పుకుని.. కొడుకు ఎంట్రీకి లైన్ క్లియర్ చేస్తారా? రానున్న ఎన్నికల్లో పర్చూరు నుంచి వారసుడ్ని బరిలో దింపబోతున్నారా?  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడివే ప్రశ్నలు అందరి మెదడ్లను తొలిచివేస్తున్నాయి. జగన్‌తో భేటీ తరువాత.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి చేసిన వేర్వేరు ప్రకటనలు ఆ కన్ఫ్యూజన్‌ను మరింత పెంచాయి.  ఇంతకీ దగ్గుబాటి వారి ఇంట ఏం జరగబోతోంది? 

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, తన రాజకీయ వారసుడు హితేశ్‌తో కలిసి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్‌తో భేటీ అయ్యారు. సుమారు అరగంటపాటు చర్చించారు. కొడుకు హితేశ్ రాజకీయ భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరడానికి డిసైడ్ అయ్యారు. హితేశ్‌కు ఎమ్మెల్యే సీటుతో పాటు.. పురంధేశ్వరికి ఎంపీ టికెట్ ఇవ్వాలని దగ్గుబాటి అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. జగన్‌తో భేటీ తరువాత వెంకటేశ్వరరావు చేసిన కామెంట్స్‌ ఏపీ రాజకీయాల్లో దుమారం రేపాయి.

ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి హితేష్‌ పోటీ చేస్తారని తెలిపారు.  కుమారుడి రాజకీయ అరంగేట్రానికి అడ్డంకి అయ్యే పరిస్థితుల్లో పురందేశ్వరి బీజేపీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటారని ప్రకటించారు. వెంకటేశ్వరరావు చేసిన ప్రకటనకు పూర్తి విరుద్ధంగా దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని, బీజేపీలోనే ఉంటానని ఆమె  స్పష్టం చేశారు. పైగా పార్టీ ఎక్కడ టికెట్ ఇస్తే అక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరడం ద్వారా హితేశ్ రాజకీయ భవితవ్యం బాగుంటుందన్న ఆలోచనలో దగ్గుబాటి ఉండగా.. కొడుకు కోసం పార్టీ మారే ప్రసక్తే లేదని పురంధరేశ్వరి చెబుతున్నారు. దగ్గుబాటి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరితే కమ్మ సామాజికవర్గంలో పట్టు చిక్కుతుందన్న యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. విరుద్ధ ప్రకటనలతో.. అందరినీ డైలమాలో పడేసిన దగ్గుబాటి దంపతులు.. ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపుతారో చూడాలి.