అయి గిరినందిని, నందితమేదిని, విశ్వవినోదిని నందినుతే
గిరివర వింధ్య శిరోధిని సిని, విష్ణువిలాసిని, జిష్ణునుతే
భగవతి హే శితికంఠ కుటుంబిని, భూరికుటుంబిని భూరికృతే
జయ జయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
శరన్నవరాత్రులు..9వ రోజు..విజయవాడ కనకదుర్గమ్మ మహిషాసురమర్దిని దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ సహజ స్వరూపం ఇదే. ఈ స్వరూపంలో దర్శించుకొనే భక్తులు..అమ్మవారి అనుగ్రహం పొందడానికి క్యూలు కడుతుంటారు. శరన్నవరాత్రులలో ఈ నవమికి మహానవమి అని పేరు. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు.
మహిషాసురుణ్ణి చంపి, అదే స్వరూపంతో ఇంద్రకీలాద్రి మీద స్వయంభువుగా వెలిసింది. మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయని, శత్రు పరాజయం కలుగుతుందని, ధైర్యం కలుగుతుందని విజయం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గ అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. 10 రోజులు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమిస్తుంది.
ఉత్సవాలకు ఏపీ నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. అక్టోబర్ 8న అమ్మవారి తెప్పోత్సవం కృష్ణానదిలో కనుల పండుగగా జరపనున్నారు. హంస వాహనంపై శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్లు వేద మంత్రాలు, అర్చకుల ప్రత్యేక పూజల మధ్య నదీ విహారం చేయనున్నారు.
Read More : శ్రీనివాస గోవిందా : తిరుమల కిటకిట..కన్నుల పండుగగా రథోత్సవం