కరీంనగర్: లక్ష్యాన్నిచేరుకోటానికి కొద్ది దూరం ఉండగానే తనువు చాలించింది ఓయువతి. పేద కుటుంబంలో పుట్టినా, ప్రభుత్వ ఉద్యోగం వస్తే కుటుంబ కష్టాలు తీరతాయనుకున్నారు కుటుంబ సభ్యులు. ఇంటికి పెద్ద కూతరును కోచింగ్ ఇప్పించి పోలీసు కానిస్టేబుల్ పరీక్షలు రాయించారు. పరీక్ష పాసైన యువతి ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్ లో అలసిపోయి శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే… కరీంనగర్ లో జరుగుతున్న పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక పోటీల్లో సోమవారం అపశృతి చోటుచేసుకుంది. కానిస్టేబుల్ కావాలనే ఆశయంతో పరుగులు తీసిన మమత అనే అభ్యర్థిని ఒక్కసారిగా కుప్ప కూలిపోయి మరణించింది. కానిస్టేబుల్ ఎంపిక కోసం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో మొదటగా 100 మీటర్ల పరుగు పందెం నిర్వహించారు. 100 మీటర్ల పరుగును నిర్ణీత సమయంలో పూర్తి చేసిన మమత ఒక్కసారిగా కుప్ప కూలిపోయి అపస్మారకస్థితిలోకి చేరుకుంది. వెంటనే ఆమెను హాస్పిటల్ కి తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే మృతి చెందింది. హార్ట్ బీట్ ఎక్కువవడంతోనే మమత మృతి చెందిందని పోలీసులు చెపుతున్నారు.
మృతురాలిది రామడుగు మండలం వెలిచాల గ్రామం. తండ్రి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ముగ్గురు కూతుర్ల లో మమత పెద్ద కూతురు. మమత ని ఇంటికి పెద్ద కొడుకు గా భావించి కానిస్టేబుల్ చెయ్యాలనే ఉద్దేశ్యంతో కష్ట పడి కోచింగ్ ఇప్పించారు. కానిస్టేబుల్ ఐతే తమ కష్టాలు తీరు తాయని భావించిన తల్లిదండ్రులకి మమత మరణం తీరని శోకాన్ని నింపింది. ప్రభుత్వం స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని తండ్రి సంపత్ పోలీసులను వేడుకుంటున్నాడు. మమత మృతితో వెలిచాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కానిస్టేబుల్ ఎంపిక కోసం వచ్చిన అభ్యర్థి మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి కి వెళ్లి మమత మృత దేహాన్ని పరిశీలించారు.బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకునేలా చూస్తామని సీపీ హామీ ఇచ్చారు.