ఏదీ ప్రజా దర్బార్ ?

  • Publish Date - September 20, 2019 / 01:16 AM IST

సంక్షేమ పథకాల అమలులో తండ్రి బాటలో నడుస్తున్నారు ఏపీ సీఎం జగన్. ప్రజా సమస్యల పరిష్కారంలోనూ రాజశేఖర రెడ్డి మార్గంలో పయనించాలని భావించారు. జనం సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించాలని నిర్ణయించారు. అందుకోసం ప్రజాదర్బార్ నిర్వహించాలని భావించారు. అయితే… ఆ కార్యక్రమం ఇప్పటికీ నోచుకోలేదు. ప్రతి రోజూ అరగంటసేపు ప్రజా సమస్యల్ని స్వయంగా తెలుసుకోవడమే కాకుండా..వాటికి అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపించాలని భావించారు. అయితే.. ప్రస్తుతం ఉన్న సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తే సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. 

సీఎం క్యాంప్ ఆఫీస్ సమీపంలో అర్జీల స్వీకరణకు స్థలాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను పరిశీలించి.. సీఎంను ఎవరు కలవాలి, వారి సమస్య తీవ్రత ఏంటి.. ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాలపై క్లారిటీ వచ్చాకే సీఎంను ప్రజాదర్బార్‌లో కలిసేలా ఏర్పాట్లుచేస్తున్నారు. అయితే.. అసలు ఈ కార్యక్రమం ఎప్పటికి ప్రారంభమవుతుందో తెలియక క్యాంప్ ఆఫీస్‌కు వస్తున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

మొదట జులై 1వ తేదీనే ప్రజాదర్బార్ ప్రారంభమవుతుందని ప్రకటించినా ఆ ఆతర్వాత వాయిదా పడుతూ వస్తోంది. రెండు మూడు తేదీలు అనుకున్నా కుదరలేదు. దీంతో… ప్రజా దర్బార్‌ను త్వరగా ఏర్పాటు చేయాలని.. సీఎంను కలుసుకునే అవకాశం కల్పించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.