హైదరాబాద్ టూ వైజాగ్.. ఓ వ్యాన్ స్పీడ్ గా వెళుతుంది. వ్యాన్ మొత్తం కవర్లతో కప్పబడి ఉంది. బయట నుంచి చూస్తే ఏదో సరుకు తరలిస్తున్నట్లు కనిపిస్తుంది. ఏదైనా వదిలే అలవాటు లేని చెక్ పోస్ట్ అధికారులు.. అనుమానం్ వచ్చి కవర్లు తొలగించి చూశారు. అంతే షాక్.. EVMలు కనిపించాయి. వెంటనే అలర్ట్ అయిన అధికారులు.. వెంటనే వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మొత్తం పరిశీలిస్తే తేలింది ఏంటంటే.. అవన్నీ డమ్మీ EVMలు.
పశ్చిమగోదావరి జిల్లాలో డమ్మీ ఈవీఎంలు కలకలం రేపాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యాన్‌లో తరలిస్తుండగా అనుమానాలకు ఆస్కారం ఏర్పడింది. ఈ ఘటన ఏప్రిల్ 03వ తేదీ బుధవారం నరసన్నపాలెం చెక్ పోస్టు దగ్గర బయటపడింది. పోలీసులు వివిధ ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ తనిఖీలు జరుపుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం నుండి వస్తున్న వ్యాన్‌ను తనిఖీలు చేశారు. అందులో ఒక బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా డమ్మీ ఈవీఎంలున్నట్లు గుర్తించారు. వెంటనే వ్యాన్‌ను సీజ్ చేసి ఇంకా ఎన్నిక ఈవీఎంలున్నాయనే దానిపై సోదాలు జరుపుతున్నారు. వీటికి ఎలాంటి బిల్లులు లేవని తెలుస్తోంది. డమ్మీ ఈవీఎంలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ? ఎక్కడకు తరలిస్తున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఓటర్లతోపాటు పార్టీలు అవగాహన కార్యక్రమాల కోసం వీటిని తీసుకెళుతున్నట్లు చెబుతున్నారు పోలీసులు. ఏమా పార్టీ, ఎవరా లీడర్లు అనేది కూడా బయటపెట్టటం లేదు.