పాపికొండలు విహార యాత్ర విషాదయాత్రగా ముగిసింది. పాపికొండలు చూడాలని వెళ్లిన పర్యాటకులు అనంతలోకాలకు వెళ్లిపోయారు. కచ్చులూరు సమీపంలో గోదావరి నదిలో సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం రాయల్ వశిష్ఠ బోటు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 10మంది మృతి చెందారు. గల్లంతైనవారి దొరక్కపోవడంతో… వారి కుటుంబీకులు ఆందోళనలో మునిగిపోయారు. ఓవైపు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు.. సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం ఉదయం ఏపీ సీఎం జగన్.. దేవీపట్నం వెళ్తారు. బాధితులను పరామర్శిస్తారు.
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలోని కచ్చులూరు.. మళ్లీ కన్నీళ్లు పెట్టించింది. ఇప్పటికే రెండు సార్లు పడవలు, లాంచీలను పొట్టన పెట్టుకున్న ఈ ప్రాంతం.. మరోసారి ఉగ్రరూపాన్ని ప్రదర్శించింది. మరింత మందిని మృత్యుముఖంలోకి నెట్టేసింది. గల్లంతైనవారు ఎక్కువగా ఉండటంతో.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే అనుమానాలు వినిపిస్తున్నాయి.
ఆదివారం ఉదయం పదిన్నర గంటల సమయంలో వశిష్ట బోట్ పాపికొండలు వెళ్లేందుకు ప్రారంభమైంది. గండిపోచమ్మ ఆలయం దాటి… ముందుకు వెళ్తున్న క్రమంలో… దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర ప్రమాదానికి గురైంది. వరద ఉధృతిని తట్టుకోలేక లాంచీ మునిగిపోయింది. లాంచీ మునిగిపోగానే.. లైఫ్ జాకెట్లు ఉన్న వాళ్లు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మరికొందరిని.. చుట్టుపక్కల గ్రామస్తులు కాపాడారు. మిగిలిన వారు గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 71మంది ఉన్నారు. అందులో 61మంది ప్రయాణిలు కాగా.. 10మంది బోట్ సిబ్బంది ఉన్నారు.
బోటు ప్రమాదంలో గల్లంతైన వారికోసం గోదావరిలో జల్లెడపడుతున్నారు. ఆదివారం రాత్రి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో.. ఇబ్బంది ఎదురైనా… రెస్క్యూ టీమ్ మాత్రం చివరి వ్యక్తి దొరికేంత వరకూ గాలింపు చర్యలు కొనసాగించేందుకే మొగ్గుచూపుతోంది.
Read More : బాధాకరమైన ఘటన : బోటు ప్రమాదంపై మోడీ ట్వీట్