మూడ్రోజులు అయిపోయాయి. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రెస్క్యూ టీమ్ గోదావరి అంతా జల్లెడ పడుతోంది. నీళ్లపై తేలుతున్న మృతదేహాలను ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. డెడ్ బాడీస్‌ని పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగిస్తున్నారు పోలీసులు. ఇంకా ఆచూకీ లభించని వారి కుటుంబాలు మాత్రం ఆందోళన చెందుతున్నాయి.
సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం.. అప్పటిదాకా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిన విహార యాత్ర ఒక్కసారిగా విషాదయాత్రగా మారింది. దేవీపట్నం మండలం కచ్చులూరు.. హాహాకారాలతో నిండిపోయింది. గోదావరిలోని సుడిగుండం కొన్ని కుటుంబాల్లో అలజడిని రేపింది. ఆటపాటలతో వెళ్లిన వారిని అమాంతంగా తనలోకి లాగేసుకుంది. విషాదాన్ని నింపింది.
ఇక బోటు ఆచూకీ కోసం విపరీతంగా శ్రమిస్తున్నారు. గోదావరిపై ఆయిల్ ఆనవాళ్లు లభించడంతో.. అదే ప్రాంతంలో బోటు ఉన్నట్టు భావిస్తున్నారు. అయితే అది 3వందల 50 అడుగుల లోతులో ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఎలాగైనా దాన్ని బయటికి తీసుకురావాలని శ్రమిస్తున్నారు. ప్రమాదం జరిగిన స్థలంలో నిపుణుల బృందం పర్యటించింది. జలవనరులశాఖ, డైరెక్టర్ ఆఫ్ పోర్ట్స్, నేవీకి చెందిన డీప్ సీ డైవర్స్.. బోటు వెలికితీయడానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. వరద ఉధృతి, బోటు ఉన్న ప్రాంతం లోతు, వెలికి తీయడానికి గల అవకాశాలు, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలనూ చర్చించారు అధికారులు. బోటు వెలికితీస్తే మరిన్ని మృతదేహాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
పడవ ప్రమాదం జరిగినప్పుడు బోటులో 73 మంది ఉండగా.. లైఫ్ జాకెట్లు ధరించిన వారు ఒడ్డుకు రాగలిగారు. 27 మంది సురక్షితంగా బతికి బయటపడ్డారు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన అధికారులు.. గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. అదే రోజు 8 మృతదేహాలను వెలికితీశారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి విస్తృతంగా గాలించాయి. రెండోరోజు సీఎం జగన్ ప్రత్యక్షంగా వెళ్లి అక్కడ ఏరియల్ సర్వే చేశారు. బాధితులను కలిసి పరామర్శించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. అయితే ఎంత వెతికినా ఎవరి ఆచూకీ లభించలేదు. బోటు జాడ కూడా దొరకలేదు. నేవీ హెలికాప్టర్‌తో గాలించినా ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది.
మూడో రోజు కూడా గోదావరిని జల్లెడ పట్టారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే 12 మంది మృతదేహాలు లభించగా.. ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర ఇద్దరు, పోలవరం కాపర్‌డ్యామ్ సమీపంలో మరో ఇద్దరి మృతదేహాలు దొరికాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని తాళ్లపూడి, కొత్తపట్టిసీమ, పోలవరం దగ్గర ఒక్కో మృతదేహం, మహానందీశ్వర స్వామి ఆలయం దగ్గర మరో రెండు శవాలు దొరికాయి. ఇప్పటివరకు అయినవారి కోసం వేచి చూసిన కుటుంబ సభ్యులు.. వారి మృతదేహాలను చూసి బోరున విలపించారు. బోటులో ప్రయాణిస్తున్న వారిలో 27 మంది సురక్షితంగా బయటపడగా.. మరో 21 మంది మృతదేహాలు లభించాయి. ఇంకా దాదాపు పాతిక మంది వరకు ఆచూకీ లభించాల్సి ఉంది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు దగ్గరుండి సమీక్షిస్తున్నారు. చివరి వ్యక్తి ఆచూకీ లభించేవరకు శ్రమిస్తామని హామీ ఇచ్చారు.
Read More : గోదావరిలో 3వ రోజు గాలింపు చర్యలు : 250 కాదు 315 అడుగుల లోతులో బోటు ఆచూకీ