కరోనా తగ్గించిన డాక్టర్లకు రైతు భావోద్వేగపు బహుమతి..నా చెమటకు ఫలితం ఈ చిరు కానుక..స్వీకరించండయ్యా…

  • Publish Date - September 18, 2020 / 10:33 AM IST

రైతన్నకు మట్టి అంటే ఎంత ఇష్టమో..ఎంత ప్రాణమో..తనకు సహాయం చేసినవారిపై కూడా అంతే ప్రేమ ఉంటుందని నిరూపించాడు ఓ రైతు. కరోనా వచ్చిన ఆ రైతుకు వైద్యం చేసిన డాక్టర్ కు ఓ గిఫ్ట్ ఇచ్చాడు.అది చూసిన ఆ డాక్టర్ భావోద్వేగానికి గురయ్యాడు.కరోనా సోకిన ఎంతోమందికి ఆయన వైద్యంచేశారు. కానీ అందిరిలో ఆ రైతు మాత్రం ఆ డాక్టర్ మనస్సుని గెలుచుకున్నాడు. బహుమతి ఇచ్చినందుకు కాదు..అటువంటి బహుమతి ఇచ్చినందుకు..!!


ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా సంక్షోభంలో కరోనా వారియర్స్ సేవలు ఎప్పటికీ మరిచిపోలేనివి. అహర్నిశలు ప్రజల ప్రాణాలను మహమ్మారి బారినుంచి కాపాడటమే పనిగా పెట్టుకున్నారు. వారి సేవలు ఎంతోమంది కుటుంబాల్ని నిలబెట్టాయి..నిలబెడతున్నాయి కూడా. అటువంటి డాక్టర్లకు..వైద్య సిబ్బందికి ఏమిచ్చినా రుణం తీరదు.


ఓ వృద్ధ రైతుకు కరోనా సోకింది. డాక్టర్లు చేస్తున్న సేవను మెచ్చి చిన్న కానుక ఇచ్చాడు. కానుక చిన్నదే కానీ ఆ రైతు మనస్సు మాత్రం పెద్దదనే చెప్పాలి. ఏదో షాపులోంచి కొనుక్కొచ్చిన బహుమతి కాదది. తన చెమటను చిందించి పండించిన పంట. ఆ కష్టానికి ఎవ్వరూ విలువ కట్టలేరు. తనకు కరోనా చికిత్స చేసిన డాక్టర్లకు తన సొంత పొలంలో తాను కష్టపడి పండించిన బియ్యాన్ని బహుమతిగా ఇచ్చి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు.


ఈ విషయాన్ని ఉర్వి శుక్లా అనే డాక్టర్ తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. . ‘ఓ వృద్ధుడు మా ఆసుపత్రిలో చికిత్స పొంది కరోనా నుంచి కోలుకున్నాడు. దీంతో మాకు కృతజ్ఞతగా తన పొలంలో పండించిన బియ్యాన్ని బహుమతిగా ఇచ్చాడు’ అని తెలిపారు.
బియ్యం ప్యాకెట్టు ఫోటోను జతచేశారు.


‘ఆ పెద్దాయన ఐసీయూలో 15 రోజులు వెంటిలేటర్‌పై చికిత్స పొందారు. పూర్తిగా కోలుకున్నాక ఇటీవల డిశ్చార్జ్‌ చేశాం. అయితే, మాకు కృతజ్ఞతలు తెలిపేందుకు తాను పండించిన బియ్యాన్ని బహుమతిగా ఇచ్చాడు. అతడు ఇచ్చిన బియ్యాన్ని ఆశీర్వాదంలాగా భావిస్తున్నాం’ అని భావోద్వేగంగా తెలిపారు. తమ సేవలను ఆ రైతు గుర్తించినందుకు తమకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.డాక్టర్ ట్వీట్ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌లో బాగా వైరల్‌ అయ్యింది.