ఎట్టకేలకు బయటకు: జైలు నుంచి విడుదలైన మాజీ ఎంపీ

  • Publish Date - January 29, 2020 / 05:03 PM IST

అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ జైలు నుంచి విడుదలయ్యారు. జ్యుడీషియల్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో 41 C.R.C సెక్షన్ కింద నోటీసు తీసుకోవడానికి రాజమండ్రి త్రీటౌన్ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన హర్షకుమార్‌ను అరెస్ట్ చేశారు.

డిసెంబర్ 13వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకోగా.. 48రోజులు ఆయన జైలులోనే ఉన్నారు. అంతుకుముందు పోలీసు కేసుల నేపథ్యంలో కొన్ని నెలలుగా హర్షకుమార్ అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. 

రాజమండ్రి జైలులో ఉన్న ఆయన ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని అప్పట్లో ఆరోపించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ తప్పూ చేయకుండా తాను 48 రోజులు జైలులో ఉన్నానని ఆయన అన్నారు.

ప్రభుత్వం తనపై తప్పుడు కేసులు బనాయించిందని ఆరోపించారు. మూడు కేసులకు సంబంధించి బెయిల్ వచ్చినా జైలులోనే ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురై ఆస్పత్రిలో ఉంటే మూడో రోజే తనను డిశ్చార్జీ చేశారని వెల్లడించారు.